సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు వేగవంతం చేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 5న దసరా పండుగ పురస్కరించుకుని లాంఛనంగా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం ఉమ్మడి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఈ సమావేశం ఉంటుందని కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు ధ్రువీకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పార్టీ పేరు మార్పు, జాతీయ పార్టీగా విస్తరించడానికి సంబంధించి శాసనసభా పక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించేలా కసరత్తు జరుగుతోంది. కొత్త జాతీయ పార్టీ పేరుపై చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తూ ఉత్కంఠను పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
తీర్మానం కాపీ సిద్ధం!
ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూనే టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చేందుకు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. ఐదో తేదీన జరిగే సమావేశంలో చేయాల్సిన తీర్మానం కాపీని సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేసే అవకాశముంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్
ఆవిర్భావ ప్రకటనకు ముందు కేసీఆర్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ నామినేషన్ పత్రాలతో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ పార్టీ ప్రకటన రోజు కూడా కోనాయపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే అవకాశముంది. అయితే పూజల నిర్వహణకు సంబంధించి స్థానిక నాయకత్వానికి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
పాటలు, సాహిత్యంపైనా కసరత్తు
జాతీయ పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన సాహిత్యం, పాటలపైనా కేసీఆర్ సూచనలకు అనుగుణంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తొలుత హిందీ భాషలో సాహిత్యాన్ని సిద్ధం చేసి, తర్వాత ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయాలని భావిస్తున్నట్లు సమాచా రం. తెలంగాణ ఉద్యమ పాటల తరహాలో ఆయా రాష్ట్రాల్లో స్థానికులను ఆకట్టుకునే బాణీల్లోనే పాటలను రూపొందించాలని రచయితలకు సూచించినట్లు తెలిసింది.
అఖిలేశ్, కుమారస్వామి రాక!
జాతీయ పార్టీపై ప్రకటన చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పలువురు ముఖ్య నేతలు, రైతు, దళిత, గిరిజన సంఘాల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ), కుమారస్వామి (జేడీఎస్)తో పాటు మరికొందరు నేతల రాక ఇప్పటికే ఖరారైంది. జాతీయ పార్టీ పేరును ప్రకటించిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను స్వాగతిస్తూ వారు అభినందనలు తెలియజేస్తారు.
విమానానికి విరాళాలు!
కొత్త పార్టీ ఏర్పాటును స్వాగతిస్తూ దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, జాతీయ పత్రికలు, మీడియాలో విస్తృత ప్రకటనలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయి మీడియా సంస్థలతో టీఆర్‌ఎస్ వర్గాలు సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కాగా జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అవసరమైన విస్తృత పర్యటనల కోసం రూ.80 కోట్లతో 12 సీట్ల సామర్ధ్యం కలిగిన ప్రత్యేక విమానం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో పార్టీ అవసరాల కోసం ప్రస్తుతమున్న హెలికాప్టర్‌ను కొనసాగించాలా? లేక కొత్తది కొనుగోలు చేయాలా? అనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. విమానం కొనుగోలుకు గతంలో పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన నేతతో పాటు ఇటీవల రాజ్యసభ్యుడిగా ఎన్నికైన వ్యాపారవేత్త, మరో ఇద్దరు ఎంపీలు తమ వంతు విరాళాన్ని కేసీఆర్‌కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment