సాక్షి, హైదరాబాద్: పాలనలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్‌వో వ్యవస్థ రద్దుకు యోచిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలోని వీఆర్‌వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లుగా పభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.
మరోవైపు ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలుకుతున్నాయి. కాగా, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే కొత్తచట్టాన్ని ప్రకటిస్తారని తెలిసింది. దానికి అనుగుణంగానే గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధం చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లుగా తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ శాఖలో కీలకంగా వారికి ఉద్యోగ భద్రత సైతం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. (చదవండి: ‘పునర్‌వ్యవస్థీకరణ’పై ప్రకటన )
Comments
Please login to add a commentAdd a comment