సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. నెగెటివ్‌గా వచ్చినవారినే సభలోకి అనుమతించారు.
స్పీకర్ పోచారం సూచనలు
సభ ప్రారంభమైన తర్వాత శాసన స్పీకర్ పోచార శ్రీనివాస్ రెడ్డి సభ్యులకు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు చదివి వినిపించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సభ్యులు ఇంటి దగ్గరే ఉండాలని చెప్పారు. సభ్యులందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అన్నారు. శానిటైజర్లను తరుచూ ఉపయోగిస్తూ ఉండాలని సూచించారు. సభ్యుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు లిఫ్ట్‌ను ఉపయోగించరాదని స్పీకర్ కోరారు.
(చదవండి: ‘పునర్‌వ్యవస్థీకరణ’పై ప్రకటన )
ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం
మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించడంతో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణతో ప్రణబ్‌కు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను ప్రణబ్ పరిష్కరించారని కొనియాడారు. నమ్మిన విలువలకు నిలబడిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా, శాసనసభ ఆవరణలో రద్దీని తగ్గించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు అనుమతి నిరాకరించడంతో పాటు మీడియా, అధికారులకు జారీ చేసే పాస్‌ల సంఖ్యను భారీగా కుదించారు. నేటి నుంచి సుమారు 20 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment