సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్‌గా అవకాశం దక్కని కార్పొరేటర్లు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 8.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సమావేశమయ్యారు.
మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విప్ జారీ చేసినట్లు వెల్లడించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతిని మంత్రి వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలసి బస్సుల్లో తెలంగాణ భవన్ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. బస్సులో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన ఆటా పాటలతో కార్పొరేటర్లను ఉత్సాహ పరిచారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రులు మహమూద్ అలీ, తలసాని, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment