‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’ | KCR Meeting With GHMC Mayor And Deputy Mayor In Hyderabad | Sakshi
Sakshi News home page

‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’

Published Fri, Feb 12 2021 2:07 AM | Last Updated on Fri, Feb 12 2021 2:29 PM

KCR Meeting With GHMC Mayor And Deputy Mayor In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్తగా ఎంపికైన జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు హితువు పలికారు.

విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్‌ నగరం అసలుసిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతోందన్నారు. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని పిలుపునిచ్చారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి కర్తవ్య బోధ చేశారు.

విజయలక్ష్మికి నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో డిప్యూటీ మేయర్‌  శ్రీలత 
ప్రతి ఒక్కరినీ ఆదరించాలి... 
‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దు. వేష భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపికగా వినాలి. చేతనైనంత సాయం చేయాలి. అబద్ధాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

బస్తీ సమస్యలే ప్రధాన లక్ష్యం కావాలి.. 
‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’అని సీఎం చెప్పారు. ‘హైదరాబాద్‌కి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింధ్‌ కాలనీ ఉంది.

గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నారు. విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృ తుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్‌ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి’అని సీఎం పిలుపునిచ్చారు. 

అందరికీ మేయర్‌ పదవి ఇవ్వలేము... అర్థం చేసుకోండి.. 
‘ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్‌ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి, సంతోశ్‌కుమార్, మంత్రు లు తలసాని, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement