
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుల అభి వృద్ధి, పరిరక్షణల కోసం జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా స్పెషల్ కమిషనర్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ సమీక్షాసమావేశంలో పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, పరిరక్షణలకు సంబంధించి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, స్పెషల్ కమిషనర్ నియామకం ద్వారా వీటిని మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 185 చెరువులు, ఇతర జలవనరులున్నాయని, వీటిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్‌కు అప్పగిస్తామని తెలిపారు. సివరేజీ నిర్వహణతోపాటు ఎస్టీపీల నిర్మాణం, శుద్ధిచేసిన నీటి మళ్లింపు, చెరువుల ఎఫ్‌టీఎల్‌ల నిర్ధారణ, సాగునీటి వనరుల పరిరక్షణ, చెరువు కట్టల బలోపేతం, చెరువులపై గ్రీన్ కవర్ పెంచడం వంటి పలు బాధ్యతలను స్పెషల్ కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు.
జీహెచ్‌ఎంసీ లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఈ కమిషనర్ కింద పనిచేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు సుందరంగా, కాలుష్యరహితంగా జలవనరులను అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రయ త్నిస్తోందని కేటీఆర్ చెప్పారు. నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణపై సమీక్షించారు.
చదవండి: టీఆర్‌ఎస్‌లో ‘సంస్థాగత’ పంచాయితీ!