
ఎన్‌డీబీఎస్ ఇండియా ఎండీ సంజీవ్ దేశ్‌పాండేను సత్కరిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లో త్వరలో ఐటీ టవర్‌తోపాటు టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామరావు అన్నారు. ఎన్‌డీబీఎస్ ఇండియా ఎండీ, సంజీవ్ దేశ్‌పాండే ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను పునరుద్ధరిస్తే కొత్త కంపెనీ తరహాలో రాయితీలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, పలువురు జిల్లా నేతలు బుధవారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశా లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుం డగా, కేంద్రం మాత్రం ప్రభుత్వరంగ సంస్థను అమ్మేందుకు కుట్ర చేస్తోందన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తే, సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం తెరలేపింద న్నారు.
ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధర ణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ చేపడ తామని ఆ జిల్లా నేతలు వెల్లడించారు. ఈ విష యమై బీజేపీ ఎంపీపై ఒత్తిడి తెస్తామన్నారు.
అటవీ భూములపై హక్కులిచ్చేందుకు సానుకూలం
ఆదివాసీ రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. టీఆర్‌ఎస్‌కి చెందిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీలకు సంబంధించిన అన్ని సమస్యలపై త్వరలో ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తమ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంఘాల ప్రతినిధులు కేటీఆర్‌ను కోరారు. భేటీలో ప్రభుత్వ విప్ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment