
సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యమైన భూమి లభించనందునే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ పక్రి య నెమ్మదిగా సాగుతోందని రాష్ట్ర మం త్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇప్పటి వర కు ఈ పథకం కింద రాష్ట్రంలో 15వేల ఎకరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. శనివారం శాసనసభ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లా డారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు.
మంథని ఘటనపై కాంగ్రెస్‌ది రాద్ధాంతం..
మంథనిలో కొందరు వ్యక్తుల నడుమ చోటు చేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ పార్టీ రెండు నెలలుగా ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నలభై ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులకోసం చేసిందేమీ లేదన్నారు. చలో మల్లారం పేరిట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడాన్ని కొప్పుల ప్రశ్నిస్తూ, ఒక గ్రామంలో జరిగిన ఘటనను టీఆర్‌ఎస్ పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలో అర్థం కాక తమ పార్టీపై అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. రంగయ్య అనే వ్యక్తి మరణానికి సంబంధించి మంథనిలో ఇద్దరు వ్యక్తుల నడుమ జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూపుతోందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి వారి మాటలు విని కాంగ్రెస్ నేతలు దళితుల కోసం పోరాటం అంటూ హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు.