సాక్షి ప్రతినిధి, కరీంనగర్: యుద్ధంలో ఒక్క శత్రువును టార్గెట్ చేస్తే సరిపోదు.. అతని బలానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన మిగతా శక్తులను కూడా దెబ్బకొట్టడమే రాజనీతి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌లోని హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్, పుట్ట మధుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఏసీపీ, ఆర్‌డీవో, ఓ తహసీల్దార్‌తోపాటు నలుగురు ఎంపీడీవోలను బదిలీ చేశారు. తాజాగా పోలీస్ ఇన్‌స్పెక్టర్లను టార్గెట్ చేశారు.
నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్‌టౌన్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్లు జి.సదన్‌కుమార్, ఎ.రమేష్, సీహెచ్.విద్యాసాగర్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కరీంనగర్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో హుజూరాబాద్‌కు వి.శ్రీనివాస్ (సీసీఎస్–3), జమ్మికుంటకు కె.రామచంద్రారావు (ధర్మపురి), జమ్మికుంట రూరల్‌కు జె.సురేష్ (సీసీ ఎస్)ను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. హుజురాబాద్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో ఉండడంతో అక్కడ సీఐ బదిలీ కాలేదు. ఈ నియోజకవర్గంలోని ఎస్సైల బదిలీలు కూడా సోమవారం జరిగే అవకాశం ఉందని సమాచారం.
మారుతున్న రాజకీయాలు
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తెగతెంపులు చేసుకున్న రీతిలోనే టీఆర్‌ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, నాయకులపై గురిపెట్టారు. ఇప్పటికే వీణవంక మండలం ఇప్పాలపల్లి పీఏసీఎస్‌లో 2015లో చోటు చేసుకున్న రూ.18.86 లక్షల అవకతవకలకు సంబంధించి ఈటల వర్గీయుడైన అప్పటి చైర్మన్ సాదవరెడ్డికి తాజాగా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఈటల వర్గీయులుగా ఉన్న టీఆర్‌ఎస్ నేతలను ఆయన వైపు వెళ్లకుండా చూసే పనిలో పడ్డారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో మంత్రి గంగుల హుజూరాబాద్‌లో మకాం వేసే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మంథని సర్కిల్‌లో పోలీసుల బదిలీలు
ఈ క్రమంలోనే ఇక్కడి పోలీసులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వామన్‌రావు హత్యకు ముందు.. తరువాత జరిగిన పరిణామాల్లో మంథని సర్కిల్ పరిధిలోని పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విచారణను తిరగతోడడంలో భాగంగా మంథని సీఐ జి.మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్‌కు అటాచ్డ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇటీవలే మంథని సర్కిల్‌కు సీఐగా బదిలీపై రావడం గమనార్హం. అంతకుముందు వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న మహేందర్‌ను బదిలీ చేసి మహేందర్‌రెడ్డిని తీసుకొచ్చారు. తాజాగా అదే సమయంలో మంథని సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేస్తున్న ఎస్సైలు అందరిని బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. జంట హత్యలు జరిగిన రామగిరి పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎ.మహేందర్‌ను బసంత్‌నగర్‌కు బదిలీ చేశారు. మహేందర్ పుట్ట మధు వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొన్నారు.
ఆయన స్థానంలో రామగుండం ఎస్‌బీకి అటాచ్డ్ అయిన ఎస్సై కె.రవిప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ముత్తారం మండల ఎస్సై సి.నరసింహారావును టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేసి కాసిపేట (మంచిర్యాల జిల్లా) ఎస్సై బి. రాములును ముత్తారానికి పంపించారు. మంథని ఎస్సై ఓంకార్‌ను ములుగుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జూలపల్లి ఎస్సై పి.చంద్రకుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లిన మహదేవ్‌పూర్, కాళేశ్వరం పరిధిలో కూడా బదిలీలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ బదిలీలన్నీ పదోన్నతులపై జరగడం గమనార్హం. మహదేవ్‌పూర్ సీఐ నర్సయ్య డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ తిలక్ నియమితులయ్యారు. కాళేశ్వరం, మహదేవ్‌పూర్ ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు.
మంథనిలో రాజకీయ మార్పులు తప్పవా..?
అలాగే మంథనిలో కూడా రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబును టీఆర్‌ఎస్‌లోకి తీసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం. వామన్‌రావు దంపతుల హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మధుకు టీఆర్‌ఎస్‌లో అవకాశాలు తగ్గినట్టేనన్న ప్రచారం జరుగుతోంది.
మంథనిలో మధు కనుసన్నల్లోనే పోస్టింగులు
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అధికారుల పోస్టింగ్‌ల విషయంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్లు మొదలుకొని నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే ద్వారానే పోస్టింగ్ పొందే పరిస్థితి. అయితే మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పోస్టింగ్‌లు, బదిలీలు అన్నీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా మధు చెప్పిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం జరుగుతోంది. దీనిపై పలుమార్లు శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు విమర్శించడం తప్ప అడ్డుకోలేకపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధుకు సంబంధం లేకుండా నియామకాలు చోటు చేసుకోవడం గమనార్హం.
మంథనిలోనూ బదిలీల పర్వం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్గీయుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మంథని నియోజకవర్గంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతులకు సంబంధించి వామన్‌రావు తండ్రి తాజాగా ఐజీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రీఓపెన్ చేశారు. ఇందులో భాగంగా పుట్ట మధును విచారణ కోసం రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. తాజాగా ఆయన సతీమణి, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజను కూడా విచారణ కోసం తీసుకొచ్చారు. ఇక మంథని నియోజకవర్గం పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పుట్ట మధుతోపాటు మున్సిపల్ చైర్‌పర్సన్ శైలజకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న అధికారులను బదిలీ చేసి, కొత్త వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా
Comments
Please login to add a commentAdd a comment