
పంటల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా రైతు అవతారం ఎత్తి స్వయంగా విత్తనాలు చల్లారు. ఇక తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వానా కాలం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మరిన్ని ‘చిత్ర’విశేషాల కోసం ఇక్కడ చూడండి.

కొద్దిరోజులుగా చినుకులు పడుతుండటంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల వ్యాప్తంగా పత్తి విత్తనాలు మొలకెత్తాయి. రైతన్నల ముఖంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే సమయంలో పత్తి మొక్కలతో పాటు కలుపు కూడా పెరుగుతోంది. దీంతో రైతులు కలుపు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా అందోల్ అన్నాసాగర్ శివారులోని పత్తి చేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు కూలీలు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఆదివారం వివాహాలు, శుభకార్యాలు పెద్ద ఎత్తున ఉండడంతో పాటు వారాంతం కావడంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు దీరాయి. – చౌటుప్పల్

రెండో దశ కరోనా విజృంభణతో మూతపడిన పాఠశాలల్ని జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు ఇప్పటికే బడిబాట పట్టారు. పాఠశాలల ఆవరణలో పేరుకున్న చెత్తా చెదారాన్ని తొలగించడటంతో పాటు బెంచీలు, ఇతర బోధన సామగ్రిని శానిటైజ్ చేసే పనిలో పడ్డారు. శనివారం పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో టీచర్లందరూ కలిసి మొక్కలు నాటుతూ, కలుపు మొక్కలు తొలగిస్తూ మైదానాన్ని శుభ్రం చేస్తున్న దృశ్యమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

పాత ఇనుము, ప్లాస్టిక్ డబ్బాలు, పేపర్లు, సీసాలు కొనుక్కొని జీవనం సాగించే బుడగ జంగాల కులస్తులు కరోనా దెబ్బకు వృత్తి దెబ్బతిని కుదేలయ్యారు. అలాగని ఏ పనీ చేయకుంటే పూట గడవదు కదా! ఇదిగో ఇలా కూలీలుగా మారారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని ఓ పొలంలో పనులు చేస్తూ కనిపించారిలా. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్

ఎప్పుడూ ప్రజల మధ్య బిజీగా గడిపే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం రైతుగా మారారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాలలో వరిలో వెదజల్లే పద్ధతి గురించి రైతులకు వివరించడంతో పాటు లక్ష్మారెడ్డి అనే రైతు పొలంలోకి దిగి స్వయంగా విత్తనాలను వెదజల్లి చూపారు. – జగదేవపూర్(గజ్వేల్)

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని ఆదివారం పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులు సందర్శకుల్ని అనుమతించారు. మాస్క్ ధరించని వారిని తిప్పి పంపారు. జలపాతం సందర్శనకు వచ్చేవారు భౌతికదూరం పాటిస్తూ అందాలను వీక్షించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు ప్రాజెక్టులో ఆదివారం దొరికిన 26 కేజీల భారీ రవ్వ చేపతో గ్రామానికి చెందిన యువకుడు – బోయినపల్లి(చొప్పదండి)

మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ముంబైలో జరిగిన ర్యాలీ. సీఎస్‌ఎంటీ వద్ద శివాజీ ముఖచిత్రం కలిగిన జెండా ఊపుతూ వెళుతున్న ఓ మరాఠా యువకుడు.

హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించడంతో ఆదివారం బియాస్ నదిలో షికారు చేస్తున్న పర్యాటకులు

సైకిళ్ల వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఆదివారం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో సైకిలిస్టులు ‘ఐ బైక్ బుడాపెస్ట్’ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం, నగరంలో సైకిలిస్టుల కోసం ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని కోరుతూ సిటీ పార్కులో సైకిళ్లను ఇలా తలకిందులుగా ఉంచారు.

జర్మనీలోని వ్యూర్జ్‌బర్గ్‌లో శుక్రవారం నాటి దాడిలో మరణించిన వారికి ఆదివారం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. డిపార్టుమెంట్ స్టోర్‌లో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment