హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరూ లేని సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో వరి దీక్ష పేరుతో దొంగ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ‘పన్ను నొప్పితో పది రోజులపాటు ఢిల్లిలో ఉన్న చంద్రశేఖర్ రావు పట్టు వస్త్రాలతో తిరిగిండు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు కలిసే అవకశముంది. చుట్టూ ఎయిర్ కండీషన్లు పెట్టుకుని ఫైవ్ స్టార్ హోటళ్లలో పందికొక్కుల్లా మెక్కుతూ టీఆర్ఎస్ నాయకులు రైతు నిరసన దీక్షల పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారు.
చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ 24 గంటల్లో కేంద్ర వరి కొనాలని అల్టిమేటం ఇచ్చాడు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేస్తున్నాం.24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ - ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వెనువుంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్‌సీఐ ఇచ్చే మొత్తాన్ని సంచులకు, తాళ్లకు, హమాలీ, ట్రాన్స్ పోర్ట్, ఛార్జీలకు చెల్లించడం జరిగేది. ఐకేపీ సెంటర్ల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లుకు ఇచ్చి రైతులను కాపాడడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర రావడం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చినంక కల్వకుంట్ల చంద్రశేఖర్ కథ మొదలు పెట్టినాడు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కొత్త నాటకానికి తెరతీశాడు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లా తిని బలిసి గజదొంగల్లా ఏసీలు పెట్టుకుని దొంగ దీక్షలు చేస్తున్నారు.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజదొంగ రూపాన్ని, ద్రోహాన్ని తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకోవాలి. గత రబీ పంటలోనే కేంద్రానికి ఇవ్వాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకూ ఇయ్యలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వలేదని చెబుతున్నారు. అంతేకాక రైస్ మిల్లర్ల దగ్గర ఉండాల్సిన బియ్యం కొన్ని వేల టన్నులు కనపడకుండా పోయిందని వార్తలు వస్తున్నాయి.
ఉత్తర తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.300 నుంచి రూ. 400 వరకూ రైతులకు మద్దతు ధర తగ్గించి మిల్లర్లు కొంటున్నారు. ఎకరానికి రూ.7 వేల నుంచి 10 వేల వరకూ రైతులకు నష్టం కలుగుతోంది. ఇతను ఇచ్చే బోడిరూ. 5వేలతో రైతులకు ఏం మేలు జరుగుతుంది. దీనిపైన పూర్తి వివరాలోతో 13వ తేదీన గవర్నర్ ను కలుస్తాం. 2014 నుంచి తెలంగాణలో ఎలా మోసం జరుగుతుందో మొత్తం వివరిస్తాం.కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐ విచారణ జరపాలి.
కేసీఆర్ ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తాడు. మోదీ పార్టీ ఏమో హైదరాబాద్ లో ధర్నా చేస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రి ధర్నాలు చేస్తుంటే కొనుగోలు ఎవరు చేయాలి?, సమస్యల పరిష్కారం పక్కన పెట్టి రైతులకు పంగనామాలు పెడ్తున్నారు. దరిద్రపుగొట్టెంగాళ్ల వేషాలతో రైతుల ప్రాణాలను ఫణంగా పెడ్తున్నారు. ముఖ్యంగా ఫెసిలిటేటర్ గా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై బాధ్యత ఉంటుంది.. కొనుగోలు చేసి రైతులును ఆదుకోవాలి. ఎగుమతులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి.. రైతులకు ఒక శాపంగా మారాడు. కల్వకుంట్ల కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై దోపిడీ చేస్తోంది’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment