సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూరే కొనసాగుతారా లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో గతంలో నియమితులైన సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జులందరూ వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ పదవులన్నింటినీ మళ్లీ ఖర్గే భర్తీ చేయనున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి పదవికి మాణిక్యం ఠాగూర్ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణకు కొత్త ఇంచార్జి వస్తారా లేదా మాణిక్యమే కొనసాగుతారా అనే చర్చ మొదలైంది.
చిదంబరంకు ఇస్తారా?
రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకుంటారనే చర్చ చాలాకాలంగా పార్టీలో జరుగుతోంది. ఆయన తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా వెళ్లే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు ఇస్తారనే చర్చ ఉంది. అన్ని పదవులను భర్తీ చేసే అధికారం కొత్త అధ్యక్షుడు ఖర్గేకు కట్టబెడుతూ నేతలంగా రాజీనామా చేసిన నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్‌ను మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలోని కొందరు ఆయన మళ్లీ కొనసాగుతారని, సంప్రదాయంలో భాగంగానే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం గతం నుంచే ఆయన్ను మార్చాలనే ప్రతిపాదన ఉందని, అందువల్ల మార్పు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్
రాష్ట్ర పార్టీ వ్యవహారాలను నేరుగా ప్రియాంకాగాంధీ పర్యవేక్షిస్తున్నందున ఆమె అభిప్రాయమే కీలకమవుతుందని, ఆమె సిఫారసును బట్టి ఖర్గే నిర్ణయం తీసుకుంటారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అయితే, కొందరు సీనియర్ నేతలు మాణిక్యం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన్ను మార్చి చిదంబరం లాంటి సీనియర్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా అంటున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరనుండటం, రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో ఉన్న పరిస్థితుల్లో గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన సీనియర్‌ను పంపుతారనే చర్చ జరుగుతోంది. మరి, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మాణిక్యం కొనసాగుతారా? లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment