భార్యాపిల్లలు ఇన్‌సెట్‌లో హరిప్రసాద్
మేడిపెల్లి (వేములవాడ): ‘దుబాయ్ పోయి పైసలు సంపాదించి పిల్లలకు ఏ లోటు రాకుండా చూద్దామని అంటివి. అమ్మను ఏడిపించొద్దు.. చెప్పినట్టు వినాలని పిల్లలకు చెప్తివి. పిల్లలను మంచిగ చూసుకో.. డబ్బులు పంపిస్త.. అని చెప్పి పోయి ఆరు నెలలైతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ లేదు. అమ్మా.. నాన్న ఎందుకు ఫోన్ చేస్తలేడని పిల్లలు అడిగితే ఇప్పటిదాకా ఏదోలాగా సమాధానం చెప్పుకొచ్చిన. నువ్వు ఎక్కడున్నా మాతో ఫోన్‌లో మాట్లాడి క్షేమంగా ఉన్నానని చెప్పు’అంటూ జాడలేని తన భర్తకోసం ఓ ఇల్లాలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంకు చెందిన శ్రీరాముల హరిప్రసాద్ (40) ఊళ్లోనే టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య నీరజతో పాటు పవన్ (9), రక్షిత (7) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు ఎదుగుతుండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆశ పడ్డాడు. గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని, అబుదాబిలో హోటల్‌లో పనికోసం రూ.2 లక్షలు చెల్లించి గతేడాది డిసెంబర్ 27న అక్కడికి వెళ్లాడు. కరోనా నిబంధనల ప్రకారం కంపెనీ వారు హరిప్రసాద్‌ను 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచారు. జనవరి 5న కంపెనీ కేటాయించిన రూములోకి మారాడు. రూల్స్ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించి జనవరి 19 నుంచి పనికి రావాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది.
అయితే జనవరి 18న చిన్న పని ఉందని తనతో రూమ్‌లో ఉన్నవారికి చెప్పి బయటకు వెళ్లిన హరిప్రసాద్ అదృశ్యమయ్యాడు. ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త అబుదాబి వెళ్లి ఫోన్ చేయకపోవడంతో భర్త పనికి కుదిరిన ప్రాంతంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీరజ. వారు అక్కడికి వెళ్లి చూడగా హరిప్రసాద్ ఫోన్‌తోపాటు లగేజీ కూడా రూములోనే ఉన్నాయి. కంపెనీ వారు సైతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. హరిప్రసాద్ ఇంటి నుంచి వెళ్లి ఆరు నెలలు అవుతున్నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఇంటికి రప్పించేలా చూడాలని భార్యా పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని, స్వగ్రామానికి తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment