నిధుల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు
రుణాల సేకరణపై కసరత్తు
5 కారిడార్లలో రూ.24,237 కోట్లతో అంచనాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, మెట్రో రెండో దశ ప్రాజెక్టులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సేకరణ సవాల్‌గా మారింది. రూ.వేల కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, జైకా వంటి సంస్థల నుంచి రుణాలు అందాలి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫోర్త్‌సిటీ, హయత్‌నగర్ తదితర 5 కారిడార్‌లలో మెట్రో రెండో దశ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇటీవల డీపీఆర్‌ను వెల్లడించింది. దాదాపు రూ.24,237 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి లభించే ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కొద్ది నెలల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రెండోదశ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయించనుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గడువులోగా పూర్తయ్యేనా?
👉 ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో కొత్తగా మరో 5 మార్గాల్లో మెట్రో విస్తరించనున్నారు. మొదట ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు పూర్తి చేయాలనేది లక్ష్యం. దశలవారీగా 2029 నాటికి అన్ని కారిడార్‌లలో మెట్రో నిర్మాణం చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ లక్ష్యానికి అనుగుణంగా నిధులు లభించడమే ప్రధానం. నిధుల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
👉 ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 15 శాతం (రూ.3,635 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం (రూ.9,210 కోట్లు) చొప్పున నిధులు కేటాయించాలి. మిగతా 50 శాతం నిధుల్లో 45 శాతం వరకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించారు. 5 శాతం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిధులు సేకరించనున్నారు. ఇప్పటికే మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం జైకా వంటి సంస్థలతో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. మరికొన్ని బ్యాంకుల నుంచి కూడా రుణాల సేకరణపై దృష్టి సారించినట్లు అధికారులు చెప్పారు. సకాలంలో బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు లభిస్తేనే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని ఒక అధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పుడు మెట్రో రెండో దశ నిధుల సేకరణే సవాల్‌గా మారింది.
పెరిగిన రూట్ కిలోమీటర్లు..
👉రెండో దశ మెట్రో ప్రాజెక్టును మొదట 78 కిలోమీటర్‌ల వరకు నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. కానీ.. రెండు, మూడు దఫాలుగా ప్రాజెక్టును వివిధ మార్గాల్లో పొడిగించారు. దీంతో ప్రస్తుతం ఇది 116.2 కిలోమీటర్‌లతో అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి పీ–7 రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన రూట్‌ను తాజాగా మార్చారు. ఆరాంఘర్ నుంచి కొత్త హైకోర్టు మీదుగా మళ్లించారు. రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మొదట ప్రతిపాదించిన రూట్‌ను సైతం ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ వరకు పొడిగించడంతో రెండో దశ రూట్ కిలోమీటర్‌లు పెరిగాయి. కొత్తగా ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్‌ల మార్గాన్ని కూడా ఈ రెండో దశలోనే ప్రతిపాదించారు.
👉 ఓల్డ్‌సిటీ రూట్‌లో మొదట ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించగా.. దాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇలా అన్ని వైపులా అదనంగా పొడిగించడంతో రెండో దశ పరిధి బాగా విస్తరించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిపాదిత ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్‌ల పొడవు ఉంటుంది. ఈ కొత్త లైన్ కోసం రూ.8000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఈ లైన్ మినహాయించి మిగతా లైన్‌లకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. రెండో దశ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 24,237 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫోర్త్‌సిటీతో కలిపితే ఇది రూ.32,237 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం 5 రూట్‌లకే డీపీఆర్ పూర్తయిన దృష్ట్యా ఈ మార్గాల్లో మెట్రో రెండో దశ చేపట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment