ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వలసల దడ | Migrations In TCongress During Graduate MLC Elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వలసల దడ

Published Mon, Feb 22 2021 12:56 AM | Last Updated on Mon, Feb 22 2021 8:37 AM

Migrations In TCongress During Graduate MLC Elections - Sakshi

పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికలవేళ బీజేపీ విసిరిన వలసల అస్త్రం కాంగ్రెస్‌ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం గాంధీభవన్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శ్రీశైలంతోపాటు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలోపే కాషాయ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలసబాట పట్టనున్నట్టు సమాచారం. 

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ విసిరిన వలసల అస్త్రం కాంగ్రెస్‌ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం గాంధీభవన్‌ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. శ్రీశైలంతోపాటు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక లోపే కాషాయ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలసబాట పట్టనున్నట్టు సమాచారం.

ఆపరేషన్‌ ఆకర్షలో భాగంగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌ అసంతృప్తులపై వల విసురుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన కూన శ్రీశైలం గౌడ్‌కు నిరాశ ఎదురుకావడంతోనే ఆయన పార్టీ మారినట్టు చర్చ జరుగుతోంది. గతంలోనూ బీజేపీలో చేరే జాబితాలో కూన పేరు వినిపించింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఉత్తరాది రాష్ట్రాల ఓటర్ల ప్రభావం ఉండడం కూడా బీజేపీలో చేరికకు కారణమని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.  

ఇంకా ఎవరెవరంటే.. 
బీజేపీలో చేరనున్న నాయకుల్లో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ పేరు వినిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి సోయం బాపూరావు ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందారు. అయితే, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని, రాథోడ్‌కు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే టికెట్‌పై హామీ ఇవ్వడంతో ఆయన కూడా త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌రావుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అయ్యారనే వార్తలు కూడా గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈమెతోపాటు మరో అనుబంధ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న యువనాయకుడిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు డీకే.అరుణ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల పేర్లు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నా వారు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుండటం గమనార్హం.  

టికెట్‌ టికెట్‌...
కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకునే క్రమంలో పార్టీ టికెట్‌ ఇస్తామనే హామీలు కమలనాథుల నుంచి వస్తున్నాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా వారు బీజేపీలోకి వెళుతున్నారని అంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు మూడు అసెంబ్లీ టికెట్‌లు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు చేవెళ్ల, మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌లపై బీజేపీ నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిందని, కూన శ్రీశైలం గౌడ్‌కు కూడా కుత్బుల్లాపూర్‌ టికెట్‌ హామీ ఇవ్వడంతోనే ఆయన బీజేపీలో చేరారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.

నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు క్షేత్రస్థాయి నేతలతో మంతనాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి వలసలపర్వం ఏయే మలుపులు తిరుగుతుందో... పార్టీలో ఉండేదెవరో, మిగిలేదెవరో అనే అంశం గాంధీ భవన్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement