సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, మతతత్వ పార్టీ అయిన బీజేపీలో చేరి, ఎర్రజెండా డైలాగులు కొడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రక్తసంబంధం కన్నా, వర్గసంబంధం గొప్పదని ఈటల అన్నారని, ఆ మాట మాట్లాడే అర్హత ఆయనకు లేదని హరీశ్ అన్నారు. వర్గ సంబంధమైన పార్టీని కాదని, మత సంబంధమైన పార్టీలో చేరింది ఎవరని నిలదీశారు. ఎప్పడు మాట్లాడినా తనది వామపక్ష భావజాలం, లెఫ్ట్ ఇజం అని చెప్పుకునే ఈటల బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్‌లో ప్రజా ఉద్యమనాయకుడు పులవేని పోచమల్లు యాదవ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడారు.
ఈటల పెట్టిన కష్టాలు, నష్టాలు భరించలేక పోచమల్లు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఏమీ చేయలేని ఈటల బీజేపీ నుంచి గెలిస్తే అభివృద్ధిని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని, పోలీసుల రబ్బర్ బుల్లెట్లకు అడ్డంగా ఉరికారని గుర్తు చేశారు. ఈటల ఓటమి ఖాయమని, తల కిందకు, కాళ్లు మీదకు పెట్టినా గెలిచే ప్రసక్తే లేదని అన్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందని, ఇక మెజార్టీ ఎంతనేది తెలాల్సి ఉందని అన్నారు.
ఈటల చారాణ బీసీ.. బారాణ రెడ్డి: గంగుల
ఈటల ఏనాడూ బీసీలాగా ప్రవర్తించలేదని, అందుకే ఆయన చారాణ బీసీ, బారాణ రెడ్డి అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. అసలు సిసలైన బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవాలని, ఆయన కేసీఆర్ విడిచిన బాణం అని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment