సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి కీలక విభాగాల్లో ప్రధానమైన సమస్యలు కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యత గల వైద్యశాఖకు పలువురు మంత్రులు మారిన ‘గాంధీ’ పరిస్థితుల్లో మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక బుట్టదాఖల అవుతున్నాయి. నిధులు మంజూరైనా పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక పరమైన అడ్డంకులతోపాటు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఫలాలు అందడం లేదని నిరుపేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక మంత్రి హరీష్‌రావుకే వైద్య ఆరోగ్య శాఖ అప్పగించడంతో గాంధీ దవాఖానాలో నెలకొన్న సమస్యలు పరిష్కారమైనట్లేనని ఆస్పత్రి పాలనయంత్రాంగంతోపాటు వైద్యులు, రోగులు భావిస్తున్నారు. వైద్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈనెల 11న హరీష్‌రావు గాంధీ ఆస్పత్రిని సందర్శించి, రేడియాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ మెషిన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గాంధీ పాలనయంత్రాంగం, అధికారులు, వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
సమస్యలు ఇవీ..
►కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌ల్యాబ్ రెండేళ్లుగా పనిచేయడంలేదు. వేలాది మంది హృద్రోగులు అప్పులు చేసి ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. నూతన క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఆధునిక క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసి గుండె చప్పుడు ఆగి పోకుండా చూడాలని పలువురు హృద్రోగులు కోరుతున్నారు.
►రేడియాలజీ విభాగంలోని ఎమ్మారై స్కానింగ్ మెషిన్ మూలనపడింది. కోట్లాది రూపాయలతో అత్యాధునిక మెషిన్ కొనుగోలు చేశారు. విద్యుత్ సరఫరా చేసి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడంతో సదరు ఎమ్మారై మిషన్ గోడౌన్‌కే పరిమితమైంది.
►సీడాక్ సంస్థతో ఒప్పంద కాలపరిమితి ముగియడంతో కంప్యూటర్ వ్యవస్థ పనిచేయడంలేదు. ఓపీ విభాగంలో చేతి రాతతో చిట్టీలు ఇవ్వడంతో రోగులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చునే పరిస్థితి నెలకొంది.
►ఐపీ బ్లాక్‌లోని ఆస్పత్రి 8వ అంతస్తులో అవయవ మార్పిడి కోసం మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం సుమారు రూ.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించగా, నేటికీ టెండరు ప్రక్రియ దాటకపోవడం గమనార్హం.
►రోగులతోపాటు వైద్యులకు ఆహార పదార్థాలు స రఫరా చేసే డైట్ క్యాంటిన్ సెల్లార్‌లోని మురుగునీటిలోనే కొనసాగుతోంది. డైట్ క్యాంటిన్ నిర్మా ణం కోసం స్థల పరిశీలన దశలో ఆగిపోయింది.
►సీసీ కెమెరాలు ఏర్పాటు గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొనసాగుతోంది. వైద్యులపై తరచూ దాడులు జరగడంతోపాటు రోగులకు చెందిన విలువైన వస్తువులు దొంగతనాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విశేషం.
►20 లక్షల చదరపు అడుగుల వైశ్యాలం గల గాంధీ ప్రాంగణంలో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బంది సరిపడేంత లేరు. వీరి సంఖ్య పెంచాలని లిఖితపూర్వకంగా పలుమార్లు విజ్ఞప్తి చేసిన వైద్య ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆస్పత్రికి చెందిన ఓ కీలక అధికారి వ్యాఖ్యానించడం విశేషం.
►పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గాంధీ వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని పెంచకపోవడం గమనార్హం. గ్రామాన్ని తలపించే గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ కొనసాగుతున్నాడు. దశాబ్ధాలుగా రిక్రూట్‌మెంట్ లేకపోవడం, ఉన్నవారంతా పదవీవిరమణ పొందడంతో ఆయా రంగాల్లో నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
►సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్కింగ్ టెండర్లు రద్దు చేయడంతో వేలాది వాహనాలు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దారి లేకపోవడం ప్రాణాపాయస్థితిలో అంబులెన్స్‌ల్లో వచ్చే బాధితులుకు వైద్యసేవలు అందించడంలో జాప్యం జరుగుతోంది.
►గాంధీ ఆస్పత్రిలో ఫైర్ సేప్టీ లేకపోవడంతో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించి కోట్లాది రూపాయల వైద్య పరికరాలు బూడిత అవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని కోరుతూ గాంధీ అధికారులు పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవలే అగ్ని ప్రమాదం సంభవించడంతో వారాల పాటు వైద్యసేవలకు విఘాతం కలిగింది.
►వీటితో పాటు అనేక చిన్నాచితక సమస్యలతో నిరుపేద రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదల రోగులతోపాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు, సిబ్బంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని వైద్య మంత్రి హరీష్‌రావును కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment