మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న బార్ కౌన్సిల్ చైర్మన్, సభ్యులు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా న్యాయవాదుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నిధుల నిర్వహణ బాధ్యతను అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు.
అరణ్యభవన్‌లో శనివారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులు కలిసి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమనిధికి ప్రతి ఏడాది రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీనివల్ల సభ్యులకు, మరణించిన లాయర్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రికి వివరించారు.
మరణించిన న్యాయవాది నామినీకి న్యాయవాదుల సంక్షేమం నిధి ద్వారా రూ.4 లక్షలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అదనంగా మరో రూ.4 లక్షలు, జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల కాలపరిమితికి ప్రతీ నెల రూ.ఐదువేలు ఉపకార వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హమీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, రాజేందర్‌రెడ్డి, కిరణ్ పాలకుర్తి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment