
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో బౌద్ధారామం నిర్మిస్తామని, అందుకు వసతులు, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగోలియా దౌత్యాధికారి గన్‌బోల్డ్ దంబజావ్ ప్రతిపాదన చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌లో ప్రతిష్టాత్మక బుద్ధవనం ప్రాజెక్టును పరిశీలించి వచ్చిన గన్‌బోల్డ్ దంబజావ్, మల్లేపల్లి లక్ష్మయ్య, తదితరులు గురువారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమయ్యారు.
ఇరుపక్షాల మధ్య బౌద్ధ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో సంబంధాలు పెంపొందించుకునే దిశగా చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా బుద్ధవనంలో మంగోలియా వాస్తు శైలి ఉట్టిపడేలా బౌద్ధారామం నిర్మించడానికి మంగోలియా దౌత్యాధికారి ఆసక్తి వ్యక్తం చేశారు. దీంతో బుద్ధవనంలో ఉన్న ఖాళీ స్థలంలో బౌద్ధారామానికి స్థలాన్ని కేటాయించడానికి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎం.డి బి.మనోహర్‌ను మంత్రి ఆదేశించారు. మంగోలియా పర్యాటక రంగంతో పరస్పర సహకార ఒప్పందానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment