సమావేశంలో శ్రీనివాస్ గౌడ్, కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమగ్ర పర్యాటకాభివృద్ధితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో బెంగుళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశంలో రెండోరోజు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపేందర్ బ్రార్‌తో సమావేశమై దక్షిణ తెలంగాణలోని మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు.
సమావేశంలో మన్యంకొండ ఆలయం అభివృద్ధి ఆవశ్యకతను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు, పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారని, వారిని మరింత ఆకట్టుకునేవిధంగా రోప్ వే, లేక్ ఫ్రంట్, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ మేరకు మంత్రి సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు.
దేశంలోని పర్యాటక ప్రదేశాల విశిష్టత, ప్రాముఖ్యతతోపాటు తగిన సమాచారాన్ని పర్యాటకులకు అందించేందుకు డిజిటల్ యాప్‌ను అన్ని భాషల్లో రూపొందించాలని మంత్రి సూచించారు. పర్యాటక శాఖలోని టూరిస్ట్ గైడ్‌లకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చి గుర్తింపుకార్డులను జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటకశాఖ అనుబంధ రంగాలైన టూర్స్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటల్ నిర్వాహకులకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహకం అందించాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి ఎ.కిషన్‌రెడ్డి, ఆ శాఖల దక్షిణాది రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment