సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు రిజర్వు చేసింది. గురువారం కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(ఏ–4), బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి(ఏ–5), కేరళకు చెందిన జగ్గుస్వామి(ఏ–6), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్(ఏ–7)ను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది.
అసలు సిట్‌కు ఈ కేసు విచారణ చేసే అర్హతే లేదని ట్రయల్ కోర్టు మెమోను తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ గురువారం విచారణ చేపట్టారు. భూసారపు శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.రాంచందర్‌రావు, రామచంద్రభారతి తరఫున సీనియర్ న్యాయవాది రవిచందర్, సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
రాంచందర్‌రావు: ‘ఏసీబీ కోర్టు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే మెమోను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వవద్దు. అసలు ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి డబ్బు పట్టుబడలేదు. అందుకే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ఇక్కడ వర్తించదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఒక పక్క కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. వీటిపై హైకోర్టులో విచారణ సాగుతుండగానే.. సిట్‌కు నలుగురిని నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది. కేసు నమోదు అంతా అవినీతి నిరోధక చట్ట ప్రకారం జరిగింది.. అన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లే అని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఇలాంటి కేసులో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎలా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని.. దర్యాప్తు ఎలా చేస్తారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది’అని నివేదించారు.
రవిచందర్: ‘నిందితుడిపై మెమో దాఖలు చేయడంలో సిట్ అనుసరించిన విధానంలోనే లోపాలున్నాయి. వారు పాటిస్తున్న పద్ధతి క్రిమినల్ చట్టంలోనే లేదు. అసలు అఫిడవిట్ దాఖలు చేయకుండా సిట్ మెమో ఎలా దాఖలు చేస్తుంది? రూ.100 కోట్ల డీల్ నిందితులకు, ఎమ్మెల్యేలకు మధ్య సాగిందని చెబుతున్న పోలీసులు ఇప్పటివరకు ఒక్క రూపాయి దొరికినట్లు ఆధారాలు చూపలేకపోయారు. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు.
బీఎస్ ప్రసాద్: ‘అనుమానాలున్న వారిని ప్రతిపాదిత నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసే అధికారం.. పోలీసులకు ఉంటుంది. ఇది తదుపరి విచారణకు ఎంతో అవసరం. కేసులో పలు పిటిషన్లు హైకోర్టు వద్ద విచారణలో ఉండగా, ఏసీబీ కోర్టు మెమోను ఎలా తిరస్కరిస్తుంది. ఏసీబీ కోర్టు తన పరిధిని దాటి మెమోను రద్దు చేసింది. మెమో అనేది కేవలం సిట్ తెలియజేసే సమాచారం మాత్రమే.
అయినా ఆర్డర్ ఇచ్చేసి చట్ట వ్యతిరేకంగా చేసింది. నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ మెమో దాఖలు చేస్తే దానిని ఏసీబీ కోర్టు కొట్టేయడం చెల్లదు. ఏసీబీ కోర్టు అధికారాలను ఉల్లంఘించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులే దర్యాప్తులను అడ్డుకోవు. అసాధారణ పరిస్థితుల్లోనే దర్యాప్తులను ఆపుతాయి. ఏసీబీ కోర్టు మాత్రం తన పరిధికి మించి ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. నిందితులు తమపై నమోదుచేసిన కేసు(ఎఫ్‌ఐఆర్ నంబర్ 455/2022) ను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేదు. దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో జరిపించాలని మాత్రమే కోరారు’అని వివరించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గత తీర్పులను కోర్టు దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment