తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదు
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఆరాధిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామాన ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ అస్తిత్వంపై దాడి– చర్చ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘అందరం కలిస్తేనే అందమైన బతుకమ్మ అవుతుంది.. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది?’ అని ప్రశ్నించారు. బతుకమ్మను సీఎం అవమానించిన విషయం తెలియదా? అని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని డిమాండ్ చేశారు. బతుకమ్మ పూర్తిగా బహు జన కులాల పండుగ అని, అగ్రవర్గాల పండుగ కానేకాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నా రు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను దెబ్బ తీసే కుట్ర చేస్తుందని మరో ఎమ్మెల్సీ వాణిదేవి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేత వీ ప్రకాశ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కవయిత్రి గోగు శ్యామల, బ్రాహ్మణ పరిషత్తు మాజీ చైర్మన్ కేవీ రమణాచారి, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బీవీఆర్ చారి, జమాతే ఇస్లామీ హింద్ అధినేత హమీద్ మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment