సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇస్తున్న పెన్షన్ రూ.750. బీజేపీ పాలిత కర్ణాటకలో రూ.650, మహారాష్ట్రలో రూ.1,000 ఇస్తున్నారు. ఇదే బీజేపీ నాయకులు మునుగోడులో గెలిస్తే రూ.3 వేల పెన్షన్ ఇస్తామని జుమ్లా హామీలు ఇస్తున్నారు. ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉంటుందా..?’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ వన్నీ జుమ్లా మాటలేనని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వండి
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రూ.3 వేల పింఛన్ ఇస్తామన్నారని, అదేవిధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండికి బండి, గుండుకు గుండు అని ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని హరీశ్‌రావు నిలదీశారు. (ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు, తర్వాత వాటిని ఉల్లంఘిస్తూ చెప్పిన మాటల వీడియోలను ప్రదర్శించారు) చిత్తశుద్ధి ఉంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. దేశవ్యాప్తంగా రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని ప్రధాని మోదీతో అధికారికంగా చెప్పించాలన్నారు. లేని పక్షంలో జుమ్లా హామీలు ఇచ్చినందుకు బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకిచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదు
నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టనపెట్టుకన్న మోదీ.. చివరికి రైతులకు క్షమాపణలు చెప్పి, ఏడాదైనా వారికిచ్చిన హామీలను నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టిన మోదీ ఇప్పటికీ తన ధోరణి మార్చుకోలేదన్నారు. కృష్ణా నీటి వాటా తేల్చకపోవడం వంటి ఎన్నో అంశాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి మునుగోడులో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆత్మగౌరవం కోసం రాజీనామా చేయలేదని, ఆస్తులు పెంచుకోవడానికి చేశారని చెప్పారు.
రూ. 2,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
రూ.200గా ఉన్న పెన్షన్‌ను తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000కి పెంచామని, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.2,016 ఇస్తున్నట్లు హరీశ్ తెలిపారు. డయాలసిస్ రోగులకు, బీడీ, గీత, నేత కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణాయే అని పేర్కొన్నారు.
ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
మిషన్ భగీరథ పథకం ద్వారా సీఎం కేసీఆర్ మునుగోడుతో పాటు ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందని, అయితే కేంద్రం ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
10 రెట్లు అధికంగా ధాన్యం దిగుబడి
యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని, నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించి, గతంలో కన్నా 10 రెట్ల అధిక ధాన్యం దిగుబడికి సీఎం కారణమయ్యారని హరీశ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట జిల్లాల చిట్టచివరి భూముల వరకు సాగునీళ్లు ఇస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: మును'గోడదూకుడు'.. కొద్దిరోజుల్లోనే మూడు పార్టీలు మారి...
Comments
Please login to add a commentAdd a comment