సాక్షి, బాన్సువాడ: గంగాజమునా తెహజీబ్ తెలంగాణది. పాలునీళ్లలా కలిసిపోయే సంస్కృతి ఈ ప్రాంతం సొంతం. అది మరోసారి రుజువయ్యిందీ పెళ్లితో. దత్తత తీసుకున్న హిందూ యువతికి.. హిందూ సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి కన్యాదానం చేశారీ ముస్లిం దంపతులు. బాన్సువాడలో ఆదివారం జరిగిన ఈ వివాహంలో మరో విశేషం కూడా ఉంది. అది కులాంతరం కావడం.
చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో
వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం బాన్సువాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఇర్ఫానా బాను, పదేళ్లకిందట జిల్లాలోని తాడ్వాయి గురుకుల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఓ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చందన అనే బాలికను ఆమె బంధువులు గురుకులంలో చేర్పించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న ఇర్ఫానాబాను, అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నా.. చందనను దత్తత తీసుకున్నారు. గురుకులంలో చదువుతున్న చందనను సెలవుల్లో తన ఇంటికే తీసుకెళ్లేవారు. ఆమె ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో డీఎంఎల్‌టీ (ల్యాబ్ టెక్నీషియన్) కోర్సు చేయించారు. అది కూడా పూర్తి కావడంతో.. పెళ్లి విషయాన్ని ఇతర టీచర్లతో పంచుకున్నారు.
చదవండి: ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు
అలా ఓ టీచర్ నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వెంకట్రాంరెడ్డితో సంబంధం కుదిర్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న పెళ్లి కాబట్టి.. ఇర్ఫానాబాను భర్త షేక్ అహ్మద్‌తో కలిసి వరుడి కాళ్లు కడిగారు. అన్ని లాంఛనాలతో ఘనంగా పెండ్లి చేశారు. కట్నం, ఇతర పెట్టిపోతలకు ఇర్ఫానా బానుతో పాటు గురుకులంలోని కొందరు టీచర్లు సహకారం అందించారు. అలాగే వివాహం, భోజన ఖర్చులకు పట్టణానికి చెందిన సాయిబాబా గుప్త స్వచ్ఛంద సాయం చేశారు. ఇర్ఫానాబాను ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు విచ్చేసి ఆశీర్వదించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాతబాలకృష్ణ, కౌన్సిలర్ నార్ల నందకిషోర్, మహ్మద్ ఎజాస్‌తో ఇతరులు తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
నాకు మూడో బిడ్డ చందన
చందనను ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు దత్తత తీసుకున్నాను. డీఎంఎల్‌టి వరకు చదివించి పెళ్ళి చేస్తున్నాను. మా సిబ్బంది, ఇతర పెద్దల సహకారంతోనే నేడు పెళ్ళి జరుగుతోంది. మానవత్వానికి మతం అడ్డుకాదు. నాకు ఇద్దరు కూతుర్లు. చందన నా మూడో కూతురు.
– ఇర్ఫానాబాను, ప్రిన్సిపాల్, గురుకులం, బోర్లం
Comments
Please login to add a commentAdd a comment