నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో గత రెండు రోజుల కిందట జరిగిన హత్య వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలోని తన ఛాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వెయ్యిరూపాయల కోసం జరిగిన గొడవలో యువకుడు హత్యకు గురైనట్లు తెలిపారు. బాన్సువాడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ వసీమోద్దీన్, షేక్‌సమీయోద్దీన్ ఇద్దరూ అన్నదమ్ముళ్ల పిల్లలు. వీరు నిజామాబాద్‌లోని ముస్తాఫా ఫ్లవర్ మర్చంట్‌లో పనికోసం చేరారు.
ముస్తఫా వద్ద వసీయోద్దీన్ రెండు సంవత్సరాల క్రితం సమీయోద్దీన్ సమక్షంలో రూ.45వేలు అప్పుగా తీసుకున్నారు. వసీయోద్దీన్ పనిమానివేయడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ముస్తఫా డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 24న వజీయోద్దీన్ ఒక్కడే ముస్తాఫా వద్దకు వెళ్లి రూ.44వేలు కట్టాడు. అనంతరం వసీయోద్దీన్, సమీయోద్దిన్ కాలూరు చౌరస్తాకు వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసి తాగారు.
(చదవండి: ‘నుడా’ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం.. ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాల జాబితా ఇదే!)
అంతలోనే మజాస్ అనే వ్యక్తి సమీయోద్దీన్‌కు ఫోన్‌చేసి రూ.45వేలకుగాను రూ.44వేలు మాత్రమే చెల్లించాడని, రూ.వెయ్యి తక్కువగా ఇచ్చాడని తెలిపాడు. దీంతో డబ్బులు ఎందుకు తక్కువ ఇచ్చావంటూ వసీయోద్దీన్, సమీయోద్దీన్‌ల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో వసీయోద్దీన్ తన వద్ద ఉన్న కత్తితో సమీయోద్దీన్‌ను ఇష్టంవచ్చినట్లు పోడిచాడు. గొడవను అలీం ఆపేందుకు ప్రయత్నంచేయగా అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు.
వెంటనే అలీం పారిపోయాడు. సమీయోద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. వసీయోద్దీన్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వసీయోద్దీన్‌ను నిజాంసాగర్ బస్టాండ్‌లో పట్టుకొని విచారించారు. హత్యచేసినట్లు అతడు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై భాస్కరచారి, తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!)
Comments
Please login to add a commentAdd a comment