బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శిస్తున్న స్పీకర్ పోచారం
సాక్షి, బాన్సువాడ: మధ్యాహ్న భోజనం మళ్లీ వికటించింది. బీర్కూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కుళ్లిన గుడ్లు వడ్డించడంతో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటలో గత గురువారం మధ్యా హ్న భోజనం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా తిరక్కుండానే మళ్లీ మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 264 మంది బడికి వచ్చారు. రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. పిల్లలకు అన్నం, పప్పుతో పాటు గుడ్డు వడ్డించారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా భోజనం చేశారు. అయితే, అన్నం తిన్న తర్వాత కొద్ది సేపటికి విద్యార్థులు కడుపు నొప్పితో అల్లాడి పోయారు. ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు విద్యా శాఖ అధికారులకు, అలాగే, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బీర్కూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి అంబులెన్సులతో పాటు రెండు ప్రైవేటు వాహనాల్లో 70 మందిని చిన్నారులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందుగానే బాన్సువాడ ఆస్పత్రికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడా పడకలు అందుబాటులో ఉంచారు.
చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు
కుళ్లిన గుడ్లు..!
మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. ఉడికించిన గుడ్డు కుళ్లిపోయిన వాసన వచ్చినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్‌రావు వంటశాలను, సామగ్రిని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ తెలిపారు. అయితే, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యులపై చర్యలు: స్పీకర్
బాన్సువాడ టౌన్: విద్యార్థుల అస్వస్థతకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించారు. ఒక్కో విద్యార్థితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం అనంతరం గుడ్డు తినడంతోనే కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయని చిన్నారులు వివరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గుడ్డు తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment