ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 5న గ్రామానికి చెందిన ముండే బలిరామ్ ఇంట్లో పెద్దల పేర్లతో పితృపక్ష పూజలు నిర్వహించి అన్నం, పప్పు, బూరెలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం 5గంటల తర్వాత భోజనం చేసిన వారిలో కొందరు శుక్రవారం సాయంత్రం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని మండల కేంద్రంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
పక్క శనివారం తెల్లవారు జాము నుంచి ఒక్కొక్కరిగా సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న కనరే రాధాబాయి, ముండే సుగంధ, సింధుబాయి, బలిరామ్, అంజలి, యమునాబాయి, మానే సునీత, ఊర్మిళ, ముండే జ్యోతిలను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కాడే డిగంబర్, కాడే సాక్షి, కాడే అనిత, కాడే కార్తీక్, కాడే నానేశ్వర్, శిరశాట్ ఊర్మిళ, ముండే ఐశ్వర్యం, రాములును అంబులెన్స్‌లో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరికొందరు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. భోజన కార్యక్రమం నిర్వహించిన ముండే బలిరామ్ ఇంటి బోరు బావి తాగునీరు, అస్వస్థతకు గురైన వారి మూత్రం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు వైద్యుడుశ్రీకాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment