
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో సాగర్ ‘మథనం’ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో... నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఏం జరగనుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుపుతో టీఆర్‌ఎస్ ఫుల్ జోష్‌లో కనిపిస్తుండటంతో టీపీసీసీ నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్న సాగర్ ఎన్నికలో సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఏదో మూల ఉన్నా .. అలా జరగకపోతే మాత్రం ఇక అంతే సంగతులనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది.
లోపం ఎక్కడుంది?
ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలి తాలు కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేశాయి. రెండు చోట్లా పది శాతానికి మించి ఓట్లు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతతో పట్టభద్రులు తమను ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో ఈ ఎన్నికలకు వెళ్లామని, స్వతంత్ర అభ్యర్థులు సాధించిన దాని కన్నా తక్కువ ఓట్లు రావడమేమిటని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు చేరువ కావడంలో తాము ఎక్కడ విఫలమవుతున్నామనే అంతర్మథనం టీపీసీసీ నేతల్లో మొదలైంది. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు దరిదాపులో లేకుండా ఓట్లు రావడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు కార్పొరేటర్ స్థానాలకు పరిమితం కావడం, పట్టభద్రుల ఎన్నికల్లో నాలుగైదు స్థానాలకు దిగజారడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ... రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడానికి కారణమేంటనేది కాంగ్రెస్ నాయకులకు అంతుపట్టడం లేదు. ఈ దశలో జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పుడు టీపీసీసీ నాయకత్వం దృష్టి సారించింది.
రెండు నెలలుగా జానా అక్కడే...
పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా అక్కడి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.జానారెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే ఓ దఫా పర్యటన పూర్తి చేశారు. ఆయన కుమారులు రఘువీర్, జైవీర్‌లు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కేడర్‌ను కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పాత సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు గతంలో తనతో ఉండి ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మాజీ సన్నిహితులు, అనుచరులను మళ్లీ అక్కున చేర్చుకునేందుకు జానా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ ఇప్పటికే హడావుడి ప్రారంభించిన నేపథ్యంలో... జానా తనకున్న విస్తృత పరిచయాలు, చరిష్మాను నమ్ముకొని ఎక్కడా వెనుకబడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపేందుకు ఈనెల 27న హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అనంతరం 29న అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు జానా సన్నాహాలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment