
సాక్షి, హైదరాబాద్: ప్రియాంక రెడ్డి హత్య కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక రెడ్డి హత్య కేసు తర్వాత తెలంగాణలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారని అన్నారు. ఆడపిల్లలు బయటికెళితే ఇంటికొచ్చే వరకు కుటుంబసభ్యులు భయపడుతూనే ఉంటున్నారని చెప్పారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని జానారెడ్డి విమర్శించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐపీఎస్ అధికారితో వెంటనే ఒక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి.. బాధిత కుటుంబాలను పరామర్శిస్తే బాగుంటుందని, ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పారు.