సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం నేడు(మంగళవారం) రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ అధికారులు పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజీలోని 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీ పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో కుంగిన ప్రాంతాన్ని వీక్షించారు. నది గర్భంలో బ్యారేజీ కిందకు వెళ్లి ఇరువైపు ఏర్పడిన పగుళ్లను పరిశీలించారు.
కాగా బ్యారేజీలో వాటర్ లీకేజీ విషయాన్ని ఇంజనీర్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లగా.. మూడు బ్యారేజిల్లో నీళ్ల స్టోరేజి అంశాన్ని ఎన్‌డీఎస్‌ఏకు ప్రభుత్వం అప్పగించింది. ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరమత్తుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి.
కాగా ఈ బ్యారేజీలోపలుమార్లు సీపేజ్‌లు ఏర్పడగా.. ఆప్కాన్స్ సంస్థ ఇప్పటికే కెమికల్ గ్రౌటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్‌లకు పూర్తిస్థాయి ట్రీట్‌మెంట్ చేయడంతోపాటు బ్యారేజీలోని లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్ సంస్థకు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించింది.
అయితే నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్ట్‌ల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం.
చదవండి: HYD: పంటి చికిత్స కోసం వెళితే ప్రాణం పోయింది..
Comments
Please login to add a commentAdd a comment