
న్యాయవాదుల భద్రత చట్టానికి ప్రభుత్వం సుముఖత
78వ స్వాతంత్య్ర దినోత్సవంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
హైకోర్టు కొత్త వెబ్‌సైట్, ఈ–టీహెచ్‌సీఆర్, డిజి టీహెచ్‌సీఆర్ పోర్టళ్లను ప్రారంభించిన సీజే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. హైకోర్టులో గురువారం ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ‘కొత్త హైకోర్టు నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేశారు.
త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించింది. గత ఏడాది కాలంలో నాలుగు లోక్ అదాలత్‌ల్లో 73,786 కేసులను పరిష్కరించాం. రూ.4.94 కోట్లు బాధితులకు అందించాం. ఎంతోమంది యువతీ యువకులు న్యాయవ్యవస్థ వైపు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ న్యాయవాదుల భద్రత చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం.
త్వరలోనే ఆ చట్టం వస్తుందని ఆశిస్తున్నాం. రాజ్యాంగాన్ని నడిపించడంలో న్యాయవ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ఇందులో న్యాయమూర్తులు, న్యాయవాదులది సమ ప్రాధాన్యత. ఏడాదిలో 9,810 పెండింగ్ కేసులు పరిష్కరించాం. కోర్ట్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌లో భాగంగా హనుమకొండ, నల్లగొండ కోర్టులను మోడల్ కోర్టులుగా గుర్తించాం’ అని అన్నారు.
సరికొత్తగా హైకోర్టు వెబ్‌సైట్
హైకోర్టు కొత్త వెబ్‌సైట్, ఎలక్ట్రానిక్ తెలంగాణ హైకోర్టు రిపోర్ట్స్ (ఈ–టీహెచ్‌సీఆర్), డిజిటల్ తెలంగాణ హైకోర్టు రిపోర్ట్స్ (డిజి టీహెచ్‌సీఆర్) పోర్టళ్లను సీజే జస్టిస్ అరాధే ప్రారంభించారు. ఈ పోర్టళ్లలో తీర్పులు ఆంగ్లంతోపాటు తెలుగులోనూ అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇకపై హైకోర్టు ఆవరణలో వైఫై ఉచితంగా అందుబాటులోకి రానుందని, ఇది క్షకిదారులకు, న్యాయవాదులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
సామాన్యులు కూడా వివరాలు తెలుసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు చెప్పారు. డిజిటలై జేషన్‌కు కూడా చర్యలు తీసుకుంటున్నామని, రెండు ద్విసభ్య ధర్మాసనాలు కాగితరహితంగా పనిచేస్తున్నా యని సీజే పేర్కొన్నారు. హనుమకొండ, నల్లగొండ కోర్టులను తొలిదశ డిజిటలైజేషన్‌కు ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment