
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అంతా అతలాకుతలమైంది. కానీ కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహిల కాలంలో ఏర్పడ్డ బస్తీ లు కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు, ఇంజినీర్ల కృషే కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్‌పురా, ఖిల్వాట్, షా అలీ బండా, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్‌ఖాన్ బజార్, హుస్సేనీ ఆలం, దూద్‌బౌలి, ఇంజిన్ బౌలి, కోట్ల అలీజా, పత్తర్‌గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్‌గూడ, ఖాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, జుమేరాత్ బజార్ తదితర ప్రాంతాలు నిన్నమొన్నటి భారీ వరదల్లోనూ ముంపునకు గురికాలేదు.
నిజాం కాలం నాటి డ్రైనేజ్
జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ వందేళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాతబస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది. 1908లో మూసీ వరద విపత్తు తర్వాత నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి రక్షించేందుకు..నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు.
విశ్వేశ్వరయ్య ప్లాన్‌లోని ముఖ్యాంశాలివీ..
- పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నిర్మాణం
- మూసీ వరదల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు
- పురానాపూల్ నుంచి చాదర్‌ఘాట్ æవరకు మూసీనది పరీవాహక ప్రాంతంలో రక్షణ గోడలు ఏర్పాటు
- డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్ పనుల పర్యవేక్షణకు నిపుణుల కమిటీ ఏర్పాటు. సకాలంలో పనులు పూర్తి ఓపెన్ డ్రైనేజీని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థగా మార్చడం
- ట్రంక్ సీవర్ మొయిన్స్, లేటరల్స్, సబ్‌మొయిన్స్, మురుగు కాల్వల డిజైన్లు సిద్ధం చేశారు
- లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు
- జాయింట్స్, మలుపుల వద్ద పైప్‌లైన్ వ్యవస్థ ఎలా ఉండాలో డ్రాయింగ్స్ ద్వారా ముందస్తుగా కసరత్తు చేసి నిర్మాణాలు చేపట్టారు
- నిజాం కాలంలో పకడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పాటు భూగర్భ అంతర్గత పైప్‌లైన్‌ల డిజైన్ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment