క్వారంటైన్‌ హోటల్స్‌లో భద్రత ఎంత..? | No Fire Safety in Gandhi Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

మేమింతే!

Aug 12 2020 8:29 AM | Updated on Aug 12 2020 8:31 AM

No Fire Safety in Gandhi Hospital Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే సదరు ఘటనలు పునరావృతం కాకుండాతగు చర్యలు తీసుకుంటామనడం పరిపాటిగా మారింది. వర్షాలొచ్చి కాలనీలు నీటమునిగినా..అగ్నిప్రమాదాలు, అక్రమనిర్మాణాల కారణంగా ప్రాణాలు పోయినా.. ఇతరత్రా ఏ సంఘటనల్లో  ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినా ప్రతి ఏటా, ప్రతి సారీవినపడే మాట..ఇక ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడమే. గత సంవత్సరం ఎల్‌బీనగర్‌లోని చిన్నపిల్లలఆస్పత్రిలో, ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌లో,ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సైతం ఇకముందు ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

అంతకుముందు అక్రమ నిర్మాణాలు కూలినప్పుడు సైతం ‘సహించేది’ లేదన్నారు. దాదాపు పదేళ్ల క్రితం సోమాజిగూడ పార్క్‌ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదంలో 40 మందికి పైగా గాయపడ్డారు. ఏడేళ్లక్రితంసికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ హోటల్‌ కుప్పకూలి పదిమందికి పైగా మరణించారు. ఇలా ఎప్పుడు ఏ  ప్రమాదం జరిగినాపునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటారు. దాదాపు నెలరోజులు తనిఖీలు, నోటీసుల జారీ వంటివి చేస్తారు. నిబంధనలు పాటించని ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేస్తామంటారు. తర్వాతకొద్దిరోజులకు అంతా మర్చిపోతారు. మరో ప్రమాదం జరిగినప్పుడు మళ్లీ చర్చ. విజయవాడలో కోవిడ్‌ ఆస్పత్రిగా మారిన హోటల్‌లో అగ్నిప్రమాద ఘటనతో మరోమారు నగరంలోని ఆస్పత్రులు చర్చనీయాంశంగా మారాయి. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాల్సిందిగా వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. 

చర్యల లేమి.. 
వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీలు ప్రమాదాలు జరిగినప్పుడు చూపే సమన్వయం, చేసిన ప్రకటనల కనుగుణంగా ఆ తర్వాత చర్యలుండవు. దాదాపు పదేళ్లక్రితం పార్క్‌ హాస్పిటల్‌ ప్రమాదం జరిగింది. సెల్లార్లను పార్కింగ్‌కు కాకుండా అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రకటించారు. వైద్యారోగ్యశాఖను సంప్రదించి..ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లులేని, ఉల్లంఘనలకు పాల్పడే ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేయిస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం ఎల్‌బీనగర్‌ షైన్‌ చిల్డ్రన్‌  హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం అనంతరం గ్రేటర్‌ పరిధిలో 1823 ఆస్పత్రులున్నట్లు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ఫైర్‌సేఫ్టీ లేనివాటికి నోటీసులు జారీ చేసింది.

వాటితోపాటు పబ్‌లు, బార్లు, కోచింగ్‌ సెంటర్లు, పాఠశాలలకు సైతం నోటీసుల జారీ చేపట్టారు. ఆస్పత్రులను సీజ్‌ చేస్తే పేషెంట్లకు వైద్య సదుపాయాలందవనే యోచనతో కఠిన చర్యలు తీసుకోలేదు. నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు చేసుకోకుంటే బిల్‌కౌంటర్లు, పరిపాలన విభాగాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు వాటిల్లో 90 శాతం హాస్పిటళ్లు ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎన్‌ఓసీలు పొందలేదు. కానీ ఏ ఒక్క ఆస్పత్రి బిల్‌కౌంటర్‌ను మూసింది లేదు. పరిపాలన విభాగానికి తాళం వేసింది లేదు. కరోనా పేరిట ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలకు లక్షలు దండుకుంటున్నప్పటికీ, ఫైర్‌సేఫ్టీ నిబంధనలు బేఖాతరు చేసిన వారిని పట్టించుకున్న యంత్రాంగమంటూ లేదు. ఆస్తిపన్ను చెల్లించకుంటే భవనాలను సీజ్‌ చేసే జీహెచ్‌ఎంసీ.. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఏర్పాట్లు లేకుంటే పట్టించుకోదు. రోడ్ల పక్కన చిరువ్యాపారులపై ప్రతాపం చూపే అధికారులు పెద్దాసుపత్రుల జోలికి పోరనే ఆరోపణలున్నాయి.   

క్వారంటైన్‌ హోటల్స్‌లో భద్రత ఎంత..? 
ఇక పలు హోటళ్లు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి, హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాల్సిన వారికి ప్రత్యేక ప్యాకేజీలను వసూలు చేస్తున్నాయి. అలాంటి హోటళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు ఏ మేరకున్నాయో వాటి నిర్వాహకులు, అధికారులకే తెలియాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement