సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టీకరణ
సందేశాత్మక, తెలంగాణ చరిత్రపై సినిమాలకే నామమాత్రంగా టికెట్ రేట్లు పెంచుతాం
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడికి పరామర్శ
తన సొంత ఫౌండేషన్ నుంచి బాలుడి తండ్రికి రూ. 25 లక్షల చెక్కు అందజేత
రాంగోపాల్‌పేట్: తెలంగాణలో ఇకపై ఎంత పెద్ద బడ్జెట్‌తో రూపొందించే సినిమాలకైనా బెనిఫిట్ షోలను అనుమతించబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్ల పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సందేశాత్మక చిత్రాలతోపాటు తెలంగాణ పోరాటం, ఉద్యమం, చారిత్రక అంశాలపై రూపొందించే సినిమాలకు నామమాత్రంగా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని తెలిపారు.
సంధ్య థియేటర్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను శనివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్‌కు గొంతులో పైపులు వేసి ఆహారం అందిస్తున్నారని.. ప్రస్తుతం చాలా బలహీనంగా ఉన్నాడన్నారు. అతను కోలుకోవడానికి ఏడాదికిపైగా సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారన్నారు.
బాలుడు కోలుకొనే వరకు ప్రభుత్వం ఆస్పత్రి ఖర్చులు భరిస్తుందని చెప్పారు. ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా రూ. 25 లక్షల చెక్కును బాలుడి తండ్రి భాస్కర్‌కు అందించారు. భాస్కర్‌కు ఆత్మస్థైర్యం అందించడంతోపాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం రేవంత్ ఆదేశాలతో తాను వచి్చనట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌కు రావొద్దని పోలీసులు రాతపూర్వకంగా సూచించినప్పటికీ హీరో అల్లు అర్జున్ వచ్చారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
కొద్దిగా మెరుగుపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం
బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కిమ్స్ ఆస్పత్రి శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. వెంటిలేటర్ సాయం లేకుండానే అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment