సాక్షి, హైదరాబాద్: హైటెక్ స్టేషన్. సాఫ్ట్‌వేర్ సంస్థలకు, వందలాది కాలనీలకు, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ముఖ్యమైన రైల్వేస్టేషన్. ఎంఎంటీఎస్ రైళ్లు, దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు హైటెక్‌సిటీ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తాయి. తరచూ రద్దయ్యే ఎంఎంటీఎస్ రైళ్ల సంగతి పక్కన పెడితే లింగంపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్లే ఒక్క రైలూ ఇక్కడ ఆగదు. రాష్ట్ర విభజన, విజయవాడలో రాజధాని ఏర్పాటు అనంతరం వందలాది మంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు హైటెక్ సిటీ నుంచి విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు.
పైగా ఉద్యోగుల కోసమే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. మొదట్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిచిన ఈ రైలును లింగంపల్లి వరకు పొడిగించారు. ఉదయం 6 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరే ఇంటర్‌సిటీ హైటెక్‌సిటీ స్టేషన్‌లో ఆగకుండానే బేగంపేట్, సికింద్రాబాద్‌కు వచ్చేస్తుంది. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. అదే ట్రైన్‌లో విజయవాడకు వెళ్లాలనుకొనే ప్రయాణికులు హైటెక్ సిటీ నుంచి అటు లింగంపల్లికి లేదా, ఇటు సికింద్రాబాద్‌కు వెళ్లాలి.
ఇదొక్కటే కాదు. గౌతమి, విశాఖ, కోకనాడ, పల్నాడు తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ హైటెక్‌సిటీ మీదుగా వెళ్లినా అక్కడ మాత్రం ఆగడం లేదు. దీంతో కనీసం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి, మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట్, సికింద్రాబాద్ స్టేషన్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అరకొరగా ఎంఎంటీఎస్‌లు..
‘హైటెక్ సిటీ నుంచి ఎంఎంటీఎస్‌లో లింగంపల్లికి లేదా సికింద్రాబాద్‌కు వెళ్లి దూరప్రాంతాల రైళ్లను అందుకోవడం ఇబ్బందిగానే ఉంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ రైళ్లు కూడా సరిగ్గా తిరగడం లేదు’ అని కేపీహెచ్‌బీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అవినాష్ అంటున్నారు. వీకెండ్స్‌లో విజయవాడకు తిరిగి బయలుదేరేటప్పుడు సకాలంలో రైళ్లు లభించక కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్ల తర్వాత లింగంపల్లి, హైటెక్ సిటీ, బేగంపేట్‌ల నుంచే ఎక్కువ మంది బయలుదేరుతారు.
ప్రతి రోజు 300 మందికి పైగా ఒక్క హైటెక్‌సిటీ నుంచే వెళ్తున్నట్లు అంచనా. ‘ఇంటి ముందు నుంచి వెళ్లే రైలు కోసం ఎక్కడికో ఎందుకు వెళ్లాలి’ అని హైటెక్ సిటీకి చెందిన విశాలి విస్మయం వ్యక్తం చేశారు. కోవిడ్ అనంతరం ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించినా సక్రమంగా నడపడం లేదు, వారానికి రెండు రోజుల పాటు రైళ్లను రద్దు చేస్తున్నారు. మిగతా రోజుల్లో సరైన సమయ పాలన లేకపోవడంతో ప్రయాణికులు ఈ రైళ్లపైన ఆశలు వదులుకొన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కష్టంగా మారింది.
ప్లాట్‌ఫామ్‌లు పొడిగించినా ఫలితం లేదు..
ఎంఎంటీఎస్ రైళ్ల కోసమే ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌లను 24 బోగీలు ఉండే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు అనుగుణంగా పొడిగించారు. సుమారు రూ.10 కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. వెయిటింగ్ హాళ్లు తదితర మౌలిక సదుపాయాలను విస్తరించారు. కానీ రైళ్ల హాల్టింగ్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ‘ఈ రైల్వేస్టేషన్‌కు అన్ని వైపులా వందల సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. కానీ ప్రజల రవాణా అవసరాల మేరకు రైల్వే సదుపాయాలు పెరగడం లేదు’ అని మాదాపూర్‌నకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment