సాక్షి, హైదరాబాద్: భారత ఉపఖండాన్ని అత్యద్భుతంగా ఏలిన మౌర్య రాజ్య చక్రవర్తి అశోకుడు మన ప్రాంతంలో కాలుమోపాడా?.. ఇప్పటివరకు పెద్దగా ఆధారాల్లేవు. గతంలో తెలుగుగడ్డపై అశోకుడి కాలం నాటి వందలకొద్దీ నాణేలు లభించాయి తప్ప ఎక్కడా ఆయన పర్యటన జాడలు బయల్పడలేదు. కానీ, మంజీరా నది ఏడుపాయల ప్రాంతంలో ఉన్న కుల్చారం వద్ద ఇటీవల పరిశోధకులకు లభించిన టెర్రకోట ముక్కపై ఉన్న ‘దేవానా’ అనే బ్రాహ్మీ లిపి అక్షరాలు దీనిపై ఆసక్తి పెంచుతున్నాయి.
దేవానాంపియ (దేవానాంప్రియ) అనేది అశోకుడి బిరుదు. దేవుడికి ప్రీతికరమైన వ్యక్తిగా తననుతాను అశోకుడు అభివర్ణించుకున్నాడని అంటారు. దేశవ్యాప్తంగా చాలా ఏళ్లనుంచి లభిస్తున్న శాసనాల్లో దేవానాంపియ పదం తప్ప ఎక్కడా అశోకుడి పేరుండదు. దీంతో తొలుత ఆ పేరుతో రాజు ఉండేవాడని చరిత్రకారులు భావించారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైన రాయచూరు సమీపంలోని మస్కీలో 1915లో లభించిన శాసనంలో దేవానాంపియ అనేది తన పేరుగానే అశోకుడు పేర్కొన్నట్టుగా ఉన్న శాసనం లభించింది. బ్రిటిష్ ఇంజనీర్ బీడన్ ఈ శాసనాన్ని చూడగా, నాటి ఎపిగ్రఫిస్ట్ కృష్ణశాస్త్రి నిపుణుల ద్వారా దాని గుట్టు విప్పారు.
దీంతో దేవానాంపియ అంటే అశోకుడే అని ప్రపంచానికి తెలిసింది. ఏపీలోని అమరావతి, కర్నూలు సమీపంలోని రాజులమందగిరి, అనంతపురం దగ్గరి ఎర్రగుడిలో అశోకుడి శాసనాలు లభించాయి. తాజాగా, దేవానాంపియ పదంలో ‘దేవానా’ అన్న అక్షరాలున్న టెర్రకోట ముక్క కుల్చారం సమీపంలో లభించింది. మిగతా అక్షరాలున్న భాగం విరిగిపోయి ఈ ముక్క మాత్రమే మిగిలి ఉంటుందని దాన్ని గుర్తించిన శంకర్‌రెడ్డి, నాగరాజు, అరుణ్‌కుమార్‌తో కూడిన బృందానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు ఎం.ఎ.శ్రీనివాసన్ తెలిపారు. ఇది క్రీ.పూ.3వ శతాబ్దానికి చెంది ఉంటుందని తెలిపారు.
తవ్వకాలు జరిపితే..
తెలంగాణ ప్రాంతంలో మౌర్యుల కాలం నాటి వందలకొద్దీ నాణేలు గతంలో లభించాయి. 1921లో కరీంనగర్ ప్రాంతంలో ఒకేసారి 420 పంచ్‌మార్క్‌డ్ నాణేలు దొరికాయి. మిగతా ప్రాంతాల్లోనూ మరిన్ని లభించాయి. కానీ అశోకుడి బిరుదుతో ఉన్న టెర్రకోట లభించటం ఇదే తొలిసారి. అది బౌద్ధ స్తూపానికి చెందిన ఫలకంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే స్తూపం ఆనవాళ్లు లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు. తన హయాంలో అశోకుడు వేలసంఖ్యలో స్తూపాలు వేయించాడు. ఈ ప్రాంతానికి ఆయన వచ్చినట్టు గుర్తుగా స్తూపం ఉండి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న రాతిగుహ బయల్పడింది. అక్కడి రాతిగుండుపై ‘హెనమో బుద్ధేయ’, ‘ధర్మ’, ‘హే జమ’ అన్న పదాలు బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment