సాక్షి, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ బోధన ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ లేదా టీవీ/టీశాట్ ద్వారా బోధన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (24 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ క్లాసులు )
మూడో తరగతి, ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ తరగతుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 5న భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యా సంవత్సర ప్రారంభం సహా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జరపాలి అన్న అంశాలపై ప్రభుత్వం చర్చించింది. (జెండా పండుగ : బోసిపోయిన చిన్నారులు)
Comments
Please login to add a commentAdd a comment