తెలుగు పంతుళ్లకు భలే గిరాకీ | Demand For Telugu Teachers In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలుగు పంతుళ్లకు భలే గిరాకీ

Published Fri, Jun 8 2018 11:08 AM | Last Updated on Fri, Jun 8 2018 11:53 AM

Demand For Telugu Teachers In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంలోనూ ఇక నుంచి తెలుగుభాష వెలిగిపోనుంది. మాతృభాష తెలుగుకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో గ్రేటర్‌ పరిధిలో పలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, కేంబ్రిడ్జి బోర్డుల సిలబస్‌తో బోధన జరుగుతున్న పాఠశాలల్లోనూ తెలుగు తప్పనిసరి కావడంతో తెలుగు పంతుళ్లకు డిమాండ్‌ పెరగనుంది. అయితే మాతృభాష బోధించే విషయంలో పాఠశాలల యాజమాన్యాలకు కొన్ని అంశాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తక్షణం తొలగించాల్సి ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో తెలుగుభాష బోధించే టీచర్లు, బోధనకు అవసరమైన మెటీరియల్,పుస్తకాల కొరత లేకుండా చూడాలని సూచిస్తున్నారు.

మహానగరం పరిధిలో సుమారు 600 పాఠశాలల్లో తెలుగుభాష అమలుపై అనుమానాలు,అపోహలను తొలగించేందుకు విద్యాశాఖ నడుంబిగించాలని కోరుతున్నారు. ఇక ఆయా పాఠశాలల్లో తెలుగు బోధనకు అవసరమైన ప్రాథమిక అంశాలు నేర్పించే పుస్తకాల తయారీ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణా స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రెయినింగ్‌కు ప్రభుత్వం అప్పజెప్పింది.   పూర్తిస్థాయిలో పుస్తకాల తయారీ, ముద్రణ విషయంలో ఈ సంస్థ నిమగ్నమైంది. మరో పదిరోజుల్లో తేటతెలుగు పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.   

పటిష్ట చర్యలు అవసరమే.. 
చిన్నారులకు మాతృభాషను నేర్పించేందుకు ప్రాథమిక స్థాయిలో ఒకటో తరగతి నుంచి ,హైస్కూల్‌ స్థాయిలో 6 వ తరగతి నుంచి విద్యార్థులకు తెలుగు వర్ణమాల,చిన్నచిన్న పదాలు,వాక్యాలు నేర్పించడం ద్వారా తెలుగుభాష పరిరక్షణకు పట్టంకట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిన విషయం విదితమే.  ఇటీవలే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తెలుగుభాష బోధనపై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అంతేకాదు తెలుగుభాష అమలుపై పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర,జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేయడంతోపాటు ప్రతీ మూడునెలలకోమారు ఈ అంశంపై సమీక్ష జరపాలని కోరుతున్నారు. ఇక మాతృభాష బోధపై విధివిధానాలు,నియమనిబంధనల అమలుపై ఆయా పాఠశాలల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగులో మాట్లాడడం,రాయడం,చదవడం వంటి అంశాలను విద్యార్థులకు నేర్పించేందుకు ప్రస్తుతానికి ఆయా పాఠశాలల వద్ద సుశిక్షితులైన టీచర్లు అందుబాటులో లేని నేపథ్యంలో... ప్రతీ పాఠశాలల్లో ప్రాథమిక తరగతులు,హైస్కూల్‌ విద్యార్థులకు మాతృభాష బోధించేందుకు ఇద్దరు తెలుగు పండితులు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. తక్షణం ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలుగు అధ్యాపకులను నియమించుకునే అంశంతోపాటు  మెటీరియల్,లైబ్రరీ,పుస్తకాలను సమకూర్చుకునే విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఒకటి నుంచి పదోతరగతి వరకు తెలుగుభాషను తప్పనిసరిగా బోధించని పాఠశాలలకు తొలివిడతగా నోటీసులు జారీచేయాలని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో విద్యాశాఖను ఆదేశించింది. సహేతుక కారణాలు చూపని పాఠశాలలకు తొలిసారి రూ.50 వేలు,రెండోమారు నోటీసుకు స్పందిచని పక్షంలో రూ.లక్ష జరిమానా విధించాలని స్పష్టంచేసిన విషయం విదితమే. 

మరో పదిరోజుల్లో పాఠ్య పుస్తకాలు  
సీబీఎస్,ఐసీఎస్‌ఈ తదితర పాఠశాలల్లో చిన్నారులకు తెలుగుబోధనకు అవసరమైన పుస్తకాల తయారీ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మరో పదిరోజుల్లో తెలుగుఅకాడమీ, ఎస్‌ఈఆర్‌టీ వద్ద పుస్తకాలు అందుబాటులోకిరానున్నాయి. ఇటీవలే పుస్తకాల్లో చిన్న చిన్న తప్పులను సరిచేశాము. ఈ పుస్తకాల తయారీలో నందినిసిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, సాంబమూర్తి తదితరులం పాల్గొన్నాము. పుస్తకాల తయారీ పకడ్బందీగా జరిగింది. 
– ఎస్‌.వి.సత్యనారాయణ, తెలుగు వర్సిటీ వీసీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement