అంతుచూస్తున్నఆన్‌లైన్ గేమ్స్
డబ్బులొస్తాయన్న ఆశతో అప్పు చేసి మరీ ఆటలు
తొలుత వచ్చినా, ఆ తర్వాత రూ.లక్షల్లో మోసం
ఇది తట్టుకోలేక యువత బలవన్మరణాలు
ఉమ్మడి వరంగల్‌తోపాటు రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఘటనలు
సాక్షి, వరంగల్: ఆన్‌లైన్ గేమ్స్ యువత జీవితాలను అగమాగం చేస్తున్నాయి. కరోనా అనంతరం చాలామంది యువత చేతిలో సెల్‌ఫోన్లు ఉండడం వల్ల కూడా.. తమకు తెలియకుండానే ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే ఈ గేమ్‌లకు అలవాటు పడుతున్నారు. తొలుత తక్కువ డబ్బులు చెల్లించి ఆడే ఈ ఆట ద్వారా వందల్లో లాభాలు ఇచ్చి అలవాటయ్యేలా చేసి.. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షల్లో దండుకుంటున్నారు.
అప్పులు చేసి.. కుటుంబసభ్యులకు తెలిస్తే పరువు పోతుందోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. 20 రోజుల వ్యవధిలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆన్‌లైన్ గేమ్, బెట్టింగ్ యాప్‌లపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వరంగల్ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్ ఆన్‌లైన్ గేమ్‌తో పాటు.. వివిధ బెట్టింగ్ యాప్‌లలో రూ.ఏడు లక్షల వరకు డబ్బులు పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పు ఇచి్చన స్నేహితులు అడగడంతో తీవ్ర మనోవేదనకు గురై గత నెల 29న హైదరాబాద్‌లోని ఘట్ కేసర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన మరిపట్ల అనుక్ ఆన్‌లైన్‌లో పబ్జీలాంటి గేమ్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.
ఆన్‌లైన్ గేమ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో అతడికి దఫాలుగా రూ.ఐదు లక్షలు పంపాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఈ నెల 15న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలతో చాలా మంది యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ కుమారుల కదలికలపై నిఘా వేయడం కనిపిస్తోంది. మృతుల్లో యువతతోపాటు గృహిణులు కూడా ఉన్నారు.
తల్లిదండ్రులు గుర్తించాలి
డ్రగ్స్, ఆల్కహాల్ లాగే.. ఆన్‌లైన్ గేమ్, బెట్టింగ్‌లకు యువత త్వరగా అలవాటుపడుతోంది. డబ్బులు ఒకసారి రాకపోయినా.. మరోసారి వస్తాయనుకుంటున్నారు. అది సరికాదని చెప్పినా వినరు. అచేతన స్థితికి వెళ్లిపోయి కొందరు చనిపోతున్నారు.
ఇంకొందరు నేరాల బాట పడుతున్నారు. దీన్నే బిహేవియరల్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు ముందే గుర్తించాలి. సైకాలజిస్టుతో థెరపీ, మెడిటేషన్ ఇప్పించాలి. గేమ్‌కు బానిసైన వ్యక్తి అందులోనుంచి బయటకు రావాలని అనుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. – అనూష వినేయత, సైకియాట్రిస్ట్
ముందు సరదాగా.. తర్వాత అలవాటై..
సులభ సంపాదన కోసం స్మార్ట్ ఫోన్‌లో వెతికేవారికి ఆన్‌లైన్ రమ్మీ, బెట్టింగ్, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్, సైట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఆన్‌లైన్ గేమ్స్‌ను సరదాగా మొదలెట్టి, ఆ తర్వాత అలవాటు పడి బయటపడలేక జీవితం అగమాగం చేసుకుంటున్నారు.
కొందరు అవి ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ అని తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అప్పులు దొరుకుతుండడం ఈ సమస్యను మరింత పెంచుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment