ఎర వేసి ఉచ్చులోకి! | China Blackmailing With Online Games | Sakshi
Sakshi News home page

ఎర వేసి ఉచ్చులోకి!

Published Sat, Aug 15 2020 4:20 AM | Last Updated on Sat, Aug 15 2020 4:38 AM

China Blackmailing With Online Games - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరిట చైనా మనవాళ్లతో ఆడుకుంటోంది. అమాయకుల్ని చేసి డబ్బులు దండుకుంటోంది. ప్రధానంగా యువత, గృహిణులు లక్ష్యంగా రూపొందించిన కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ ద్వారా భారీ ఎత్తున కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా రూ.1100 కోట్ల మేర టర్నోవర్‌ చేసింది. దీనికి సంబంధించి నలుగురు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసి కేసు వివరాలను వెల్లడించిన విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో అసలు ఈ గేమ్‌ పూర్వాపరాలు ఏమిటి? యువత దీనికి బానిసగా చిక్కి ఎలా భారీమొత్తంలో సొమ్ములు పొగొట్టుకుంటుందో చూస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

దళారుల్ని ఏర్పాటు చేసుకుని దందా
రిఫరల్‌ ద్వారా ఈ గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత కనీసం రూ.200 రీచార్జ్‌ చేసుకోవాలి. ఇలా మీరు 20 మందిని ఆకర్షించి వారితో రూ.200 చొప్పున రీచార్జ్‌ చేయిస్తే మీకు రూ.500 కమీషన్‌ ఇస్తామని చెబుతారు. దీంతో అప్పటికే ఈ గేమ్‌కు బానిసై డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు తమకు తెలియకుండానే మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ చేయిస్తారు. అలా మరికొందరు ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. మరోవైపు ఈ గేమ్స్‌ను కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ ద్వారా అడటానికి ఆస్కారం ఇవ్వరు. కేవలం లింకు ద్వారా ఓపెన్‌ చేసి, ఫోన్‌లో అడేలా ప్రోత్సహిస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 27 వెబ్‌సైట్స్‌ యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అసలు కిటుకంతా ఆఖరి 30 సెన్లలోనే
ఈ గేమ్‌ యాప్‌లో ‘జాయిన్‌ గ్రీన్‌’, ‘జాయిన్‌ వైలెట్‌’, ‘జాయిన్‌ రెడ్‌’పేరుతో మూడు అంశాలు ఉంటాయి. వీటి కింద 0 నుంచి 9 వరకు అంకెలు రెండు వరుసల్లో ఉంటాయి. ఓ రంగును ఎంచుకుని, నిర్దారిత మొత్తం బెట్టింగ్‌ పెట్టి, కింద ఉండే అంకెల్లో దేన్ని ఎంచుకుంటే.. అన్ని రెట్ల మొత్తం పందెం కాసినట్లు. అంటే, రూ.100 బెట్టింగ్‌ పెట్టి, 4 అంకెను ఎంచుకుంటే ఆ రంగు మీద రూ.400 పందెం కాసినట్లు. ఒక్కో బెట్టింగ్‌ సమయం 3 నిమిషాలు మాత్రమే. దీన్ని సూచిస్తూ ఓ కౌంట్‌డౌన్‌ టైమర్‌ ఉంటుంది. ఆఖరి 30 సెకన్లకు వచ్చే లోపే బెట్‌ వేయాలి. ఈ 30 సెకన్లలోనే అసలు గుట్టు దాగి ఉంటుంది. నిగూఢంగా ఉండే ప్రోగ్రామింగ్‌.. ఈ సమయంలో ఎక్కువ మంది ఏ రంగుపై బెట్‌ వేశారు? తక్కువ మంది ఏ రంగును ఎంచుకున్నారో గుర్తిస్తుంది. అనంతరం తక్కువ మంది పందెం కాసిన రంగు వచ్చేలా చేస్తుంది. ఫలితంగా ఎక్కువ మంది ఓడిపోతారు.. తక్కువమంది గెలుస్తారు. ఇలా పెద్ద మొత్తం లో సొమ్ము నిర్వాహకుల పరమవుతుంది. మరోవైపు గెలిచినవారి నుంచి కూడా పన్ను రూపేణా కొంత మొత్తం మినహాయించుకుంటారు. ఇలా రెండు వైపుల నుంచీ నిర్వాహకులు పెద్దమొత్తంలో ఆర్జిస్తున్నారు. 

టెలిగ్రాం గ్రూపుల ద్వారా బ్రెయిన్‌ వాష్‌
నాకు కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ సంగతి నా స్నేహితుడి ద్వారా తెలిసింది. అతడే నా నంబర్‌ను ఓ టెలిగ్రాం గ్రూపులో చేర్చాడు. దళారి అయిన దాని అడ్మిన్‌ ప్రతి ఒక్కరినీ బ్రెయిన్‌ వాష్‌ చేస్తుంటాడు. నేను చేరిన గ్రూప్‌లో 7 వేలమంది సభ్యులు ఉండగా.. మరో దాం ట్లో 65వేల మంది ఉన్నారు. కనీసం ఐదుసార్లు డబ్బు పెడితే కచ్చితంగా ఒక్కసారైనా గెలుస్తామని, ఫలానా రంగును ఎంచుకున్నవారికి డబ్బు వస్తుందని టెలిగ్రాం, వాట్సా ప్‌ ద్వారా సందేశాలు వస్తూనే ఉంటాయి. మొదట నేను రూ.4వేలు నష్టపోయా. ఆ మొత్తం రాబట్టుకోవాలని కొనసాగించి రూ. 97వేలు పొగొట్టుకున్నా. ఈ విషయం టెలి గ్రాం గ్రూప్‌లో పోస్టు చేశానని అడ్మిన్‌ నన్ను బ్లాక్‌ చేశాడు. గతంలో నేరుగా ఆ యాప్‌లో గూగుల్‌ పే, పేటీఎం ద్వారా రీ–చార్జ్‌ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వాళ్లు పంపే లింకు ఆధారంగా గూగుల్‌ పే లేదా నెట్‌ బ్యాకింగ్‌తో రీ–చార్జ్‌ చేసుకుని ఆడేలా మార్చారు.      – సీతాఫల్‌మండి 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement