సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు కూడా తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ‘హాస్టళ్ల నుంచి మీ పిల్లలను తీసుకెళ్లండి..’అని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పంపించేస్తున్నాయి. అయితే హాస్టళ్ల ఫీజులు పూర్తిగా చెల్లించిన తల్లిదండ్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టి నెలైనా గడవక ముందే హాస్టళ్లు మూతపడిన నేపథ్యంలో తమకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కొందరు, వచ్చే సంవత్సరానికి సర్దుబాబు చేయాలని కొందరు కోరుతున్నారు.
మార్చి నెలలోనే అధికంగా చేరికలు
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యక్ష బోధనను ప్రారంభించింది. ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ మార్చి నెలలోనే ఎక్కువమంది హాస్టళ్లలో చేరారు. జేఈఈ మెయిన్ రెండో పరీక్ష అనంతరం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాస్టళ్లలో వచ్చి చేరారు. పాఠశాలల హాస్టళ్లు మొదలుకుని అన్ని కళాశాలల హాస్టళ్లలో 4.5 లక్షల మంది వరకు విద్యార్థులు చేరినట్లు అంచనా. రాష్ట్రంలో 1,584 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, 574 కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను హాస్టళ్లలో చేర్చుకున్నాయి.
ఇక 10,900 వరకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా వేయి వరకు విద్యా సంస్థలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. వాటిల్లోనూ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పించారు. మరోవైపు రాష్ట్రంలోని 250 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు కూడా హాస్టళ్లను ప్రారంభించాయి. ఆయా కాలేజీ ల్లోని సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు హాస్టల్ ఫీజులు చెల్లించారు. మిగిలిన 3, 4 నెలల కాలానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలిఅయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు సైతం వైరస్ బారిన పడుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసేయాలని ఆదేశించింది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి నెల రోజులైనా గడవక ముందే, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చేర్పించిన కొందరు తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు చేరారో లేదో.. హాస్టళ్లు మూతపడటంతో సమస్య ఏర్పడింది. పిల్లల చదువు కోసం అప్పులు చేసి మరీ ఫీజులు పూర్తిగా చెల్లించామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాటిని తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్న విద్యార్థులకు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇప్పించాలని, మిగతా విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా లేదా వచ్చే విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment