సాక్షి, సిటీబ్యూరో: కరోనా బాధితుల ప్రాణాలు నిలిపేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా చేపట్టిన ‘ప్లాస్మా డొనేషన్’కు మహా స్పందన వస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తుండడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతోంది. ‘డొనేట్‌ప్లాస్మా.ఎస్‌సీఎస్‌సీ.ఇన్’ ఆన్‌లైన్ పోర్టల్ మొదలైన వారం రోజుల్లోనే వెయ్యి మంది ప్లాస్మా దాతల జాబితాను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. ఇప్పటికి రక్తం, ప్లాస్మా ఇచ్చేందుకు చాలా మంది ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకుంటున్నారు. వారిచ్చిన బ్లడ్ గ్రూప్ ఆధారంగా అవసరార్థులను గుర్తించి ప్లాస్మాను ఇవ్వడానికి మధ్య వారధిగా సైబరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 297 మంది ప్లాస్మా దానం చేసి 450 మందికిపైగా కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అయితే ఈ సామాజిక ఉద్యమానికి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునివ్వడంతో మరింతగా దాతలు పెరగొచ్చని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్లాస్మా దాతలు దేవుళ్లతో సమానం...
‘సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్‌కు రక్తం, ప్లాస్మా కావాలంటూ, ఇస్తామంటూ ప్రతిరోజూ ఫోన్‌కాల్స్ ద్వారా అభ్యర్థనలు వస్తున్నాయి. ప్లాస్మా దానం అనేది సామాజిక బాధ్యత. ప్రాణాలు కాపాడుతున్న ప్లాస్మా దాతలు దేవుళ్లతో సమానం. వీరికి సమాజం ఎంతగానో రుణపడి ఉంటుంది. వీరిని చూసి గర్వంగా కూడా ఫీలవుతోంది. 500 ఎంఎల్ ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు నిలుపుతుంది. ఇవి వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సెలబ్రిటీలు చిరంజీవి, మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ తదితరులు తమ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునివ్వడం ఆనందించదగ్గ విషయని అన్నారు.
సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444 రిజిష్టర్ పోర్టల్ లింక్: డొనేట్‌ప్లాస్మా.ఎస్‌సీఎస్‌సీ.ఇన్
Comments
Please login to add a commentAdd a comment