నల్లగొండ/ హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాల్ని సేకరణ దిశగా దర్యాప్తు బృందం తీవ్రంగా యత్నిస్తోంది. ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కేసు వీగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న హోంగార్డు, ఎలక్ట్రిషియన్ల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)లో ఆధారాలు ధ్వంసం చేసిన ఎలక్ట్రిషియన్, హోంగార్డులను విడివిడిగా పోలీసులు విచారించారు. ‘‘ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎంత డబ్బు ఇచ్చారు?. జనవరి 4వ తేదీన ఎస్‌ఐబీలోకి రమ్మని ఎవరు పిలిచారు?. ఆ టైంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా?. అసలు ఎస్‌ఐబీ కార్యాలయంలోకి కట్టర్‌లతో ఎలా వెళ్లారు?.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను, పెన్‌డ్రైవ్, ఇతర డివైజ్‌లను డే టైంలో ధ్వంసం చేశారా? నైట్‌టైంలో ధ్వంసం చేశారా?. ఎస్‌ఐబీ ఆఫీస్‌లో కాకుండా వేరే చోట కూడా ధ్వంసం చేశారా?’’ ఇలాంటి ప్రశ్నలు ఆ ఇద్దరికి సంధించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వృథా కాకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.
ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్?
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల టైంలో పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అభియోగాలతో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. నల్లగొండలో సర్వర్ రూం ఏర్పాటు చేసుకుని ఈ ఇద్దరూ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఓ మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఫోన్లను ఎప్పటికప్పుడు వీళ్లు అబ్జర్వ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరు అధికారుల హస్తం ఉందని భావిస్తున్నారు.
రాధాకిషన్ అస్వస్థత
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. రెండోరోజు విచారణ సందర్భంగా.. హైబీపీకి ఆయన గురైనట్లు సమాచారం. అయితే బంజారాహిల్స్ పీఎస్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment