అన్నంలో ప్లాస్టిక్ రాళ్లు
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉందనే వార్త మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంలో శనివారం బియ్యం పంపిణీ చేశారు. ఇంటికెళ్లి పరిశీలించగా ముత్యం వంటి పరిమాణంలో ప్లాస్టిక్ రాళ్లు కనిపించాయి. వీటిని గమనించిన లబ్ధిదారులు వెంటనే రేషన్ డీలర్‌కు చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ వోలపు శారద, ఎంపీటీసీ సభ్యుడు డేగ బాపు రేషన్ దుకాణాన్ని పరిశీలించి బియ్యం తీసుకున్న వారిని అప్రమత్తం చేశారు. వెంటనే దండోరా కూడా వేయించి ఆ బియ్యం తినొద్దని.. తిరిగి ఇచ్చేయమని చాటింపు వేయడంతో ఆ దుకాణంలో తీసుకున్న లబ్ధిదారులంతా ఆందోళన చెందారు.
వారిలో పది మంది తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ రాళ్లు ఉన్నాయి. శుక్రవారం పంపిణీ చేసిన వాటిలో కూడా కొందరికి ప్లాస్టిక్ రాళ్లు వచ్చాయని తేలింది. తహసీల్దార్ మహ్మద్ జమీర్ దుకాణాన్ని పరిశీలించారు. ప్లాస్టిక్ బియ్యం వంటి రాళ్లను కొంతమంది సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు. అయితే మూడు రోజుల కిందట నంనూర్ పునరావాస కాలనీలోని రేషన్ దుకాణంలో కూడా బియ్యంలో ప్లాస్టిక్ వచ్చినట్లు ప్రచారం జరిగింది.
వండుకుని తిన్నాం
మొన్న శుక్రవారం రేషన్ బియ్యం తీసుకువెళ్లా. శనివారం ఉదయం ఇంట్లో ఈ బియ్యాన్నే వండుకుని తిన్నాం. ఇంతలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని దండోరా వేయించారు. అది విన్నప్పటి నుంచి భయంగా ఉంది. వెంటనే వండిన అన్నాన్ని పరిశీలిస్తే అందులో ప్లాస్టిక్ రాళ్లు కనిపించాయి. మేము అదే అన్నం తిన్నాం.. ఏం జరుగుతోందనని భయమవుతోంది.
– మాదినేని రాజమ్మ, వేంపల్లి
Comments
Please login to add a commentAdd a comment