సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైలు తర్వాత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రైలు సర్వీసు ‘నమో భారత్’. మెట్రో రైళ్ల కంటే చాలా ఎక్కువ వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు.. వసతుల్లోనూ వాటికంటే మెరుగ్గా ఉంటాయి. బుల్లెట్ రైలు మాదిరిగా ముందు భాగం ఏరోడైనమిక్ డిజైన్‌తో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే.. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్య ఈ సేవలు మొదలయ్యాయి. దాదాపు 160 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ రైళ్లు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
భాగ్యనగరంతో బంధం...
ఎన్నో ప్రత్యేకతలతో పట్టాలెక్కిన ఈ రైళ్లకు భాగ్యనగరంతోనూ ఓ బంధం ముడిపడి ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపం, అత్యధిక వేగం, మెట్రో రైళ్లకంటే వెడల్పు, ఎత్తుగా ఉండటంతో విశాలమైన కోచ్‌లు.. ఇలా పలు ప్రత్యేకలతో ఉన్న ఈ రైలును డిజైన్ చేసింది ఆల్‌స్టోమ్ అనుబంధ విభాగం ఉన్న హైదరాబాద్‌లోనే కావటం విశేషం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి కంపెనీ ఆల్‌స్టోమ్ ప్రపంచ వ్యాప్తంగా రైలు రోలింగ్‌స్టాక్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా మన దేశంలో ఆల్‌స్టోమ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఏర్పాటై, మెట్రో రైళ్లను తయారు చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం నమో భారత్ రైలును డిజైన్ చేసింది. ఎరోడైనమిక్ నోస్ మోడల్‌తో రూపొందించిన ఈ డిజైన్ టెండర్ ద్వారా అమోదం పొందింది.
ఎన్నో ప్రత్యేకతలు...
- గంటకు దాదాపు 180 కి.మీ. వేగంతో దూసుకుపోయే సామర్ధ్యంతో దీన్ని రూపొందించారు. అంత వేగంతో వెళ్లేప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు బుల్లెట్ రైలు తరహాలో ఎరోడైనమిక్ నోస్ మోడల్‌ను రూపొందించారు.
- దేశంలో సాధారణ మెట్రో రైళ్లు 2.8 మీటర్ల నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటాయి. కానీ నమో భారత్ ఏకంగా 3.2 మీటర్ల వెడల్పుతో ఉంది. మెట్రో రైళ్లలో బెంచీల తరహాలో సీటింగ్ సిస్టం ఉండగా, ఇందులో వందేభారత్ చైర్ కార్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని వేగంగా ఢిల్లీ నగరంలోని అసుపత్రులకు తరలించేందుకు కూడా అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. రోడ్డు మార్గాన రెండు గంటల్లో వెళ్లే దూరాన్ని ఈ రైలు కేవలం అరగంటలో చేరుతుంది. స్ట్రెచర్‌తో సహా రోగిని రైలు కోచ్‌లో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్ట్రెచర్‌ను అటాచ్ చేసే సిస్టమ్ ఉంది.
ఆ కంపెనీ టేకోవర్..
నమో భారత్ రైలు డిజైన్‌ను హైదరాబాద్‌లో రూపొందించగా, గుజరాత్‌లోని సావ్లీ గ్రామంలో ఉన్న బాంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే మరో బహుళజాతి కంపెనీకి చెందిన యూనిట్‌లో ఈ రైళ్లను తయారు చేశారు. 2021లో ఈ కంపెనీని కూడా ఆల్‌స్టోమ్ కంపెనీ టేకోవర్ చేయటం విశేషం. త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కూడా ఈ సంస్థ బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం నగరంలో 90 కి.మీ. వేగంతో తిరుగుతున్న మెట్రో రైళ్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో రైళ్లు కనీసం 30 కి.మీ. అధిక వేగంతో తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కాస్త ఎరో డైనమిక్ లుక్‌తో ఉండనున్న ఈ రైళ్ల తయారు కోసం ఈ కంపెనీ సిద్ధమవుతోందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment