బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు
ప్రధాని మోదీ హాజరయ్యే పరేడ్‌గ్రౌండ్స్ సభకు బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సభలో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొననున్న నేపథ్యంలో భారీస్థాయిలో సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్న మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణతోపాటు పలు రైల్వే, రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనితోపాటు పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకుప్రాధాన్యత ఏర్పడింది. అటు అభివృద్ధి, ఇటు రాజకీయం అనే ద్విముఖ వ్యూహంతో మోదీ తెలంగాణ పర్యటన సాగనున్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయ ప్రకంపనల మధ్య..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుండటం, కవితను ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారం, రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, దానిపై బీఆర్‌ఎస్–బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. అంతేగాకుండా ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలన్న ఉత్సాహంతో కమల దళం వ్యూహాలు పన్నుతోంది. బీఆర్‌ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతలపై దూకుడుగా విమర్శలు ఆరోపణలు చేస్తోంది.
ఇందుకు దీటుగా బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో మోదీ రాష్ట్ర పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బహిరంగ సభలో మోదీ ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడే అంశాలు, ఆ తర్వాత జరిగే పరిణామాలు.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి
వచ్చే 40 ఏళ్ల వరకు కూడా ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించగలిగేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌కు 25 వేల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉండగా.. భవిష్యత్తులో రద్దీ సమయాల్లో 3,25,000 మందికి సరిపోయేలా రైల్వేస్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతమున్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్‌ఫామ్‌లను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఏర్పాటు చేయనున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రోస్టేషన్లకు, రేతిఫైల్ బస్‌స్టేషన్‌కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి వసతులను కల్పిస్తారు.
ప్రధాని కార్యక్రమాలు ఇవీ
ఈ నెల 8న తెలంగాణ పర్యటనలో భాగంగా మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.
ఆ షెడ్యూల్ ప్రకారం..
► మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్– తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13వ వందేభారత్ రైలు)ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు.
► రూ.715 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మధ్య రూ.1,410 కోట్ల వ్యయంతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేస్తారు.
► సామాన్య ప్రజల రైలుగా మన్ననలు పొందిన ఎంఎంటీఎస్ ఫేస్–2 లో భాగంగా హైదరాబాద్ శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడిచే 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు.
► ఎంఎంటీఎస్ ఫేస్–2లో భాగంగా బొల్లారం– మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్లు, ఫలక్‌నుమా–ఉందానగర్ మధ్య 14 కిలోమీటర్ల కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రధాని తిలకించనున్నారు.
► తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభా స్థలికి ప్రధాని చేరుకుంటారు.
► సభా వేదిక వద్దే రూ.7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
► అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment