వరంగల్ రూరల్ జిల్లాలో ప్రమాణం చేయిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య, పారిశుద్ధ్య రంగ సిబ్బంది ఎంత కీలకపాత్ర పోషించారో పోలీసులూ అంతే స్థాయిలో సేవలందించారు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో రక్షక భటులు అందించిన సేవలు ప్రశంసనీయం. వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంలో సమర్థంగా వ్యవహరించి, ఆదర్శంగా నిలిచారు. అయితే, లాక్‌డౌన్ క్రమక్రమంగా సడలిస్తుండడంతో సాధారణ జీవితం మళ్లీ యథాస్థితికి చేరుతోంది.
ఇదే క్రమంలో వైరస్ వ్యాప్తీ పెరుగుతోంది. గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో వరుసగా పండుగలు రానునుండడం, సెకండ్ వేవ్ మొదలయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు శాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ బారిన పడకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రతిజ్ఞ–ప్రచారం కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతీ పౌరుడు మరింత బాధ్యతగా వ్యవహరించేందుకు కేంద్రం ఆదేశాల మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో వీటిని అమలు చేయాలని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
(చదవండి: రెండోసారి కరోనా.. మరింత తీవ్రం)
ఏం చేస్తారంటే..
‘‘ప్రతీ మనిషికి ఆరడుగుల దూరం పాటిస్తాను. బహిరంగ ప్రదేశాల్లో తప్ప కుండా మాస్కు ధరిస్తాను. తరచూ చేతులను సబ్బు, శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటాను’’అంటూ సాగే.. ఈ ప్రతిజ్ఞను అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోనూ ప్రారంభించారు. బస్టాండులు, కూడళ్లు, ఇన్‌నిస్టిట్యూషన్, మహిళా సంఘాలు, ప్రైవేటు–ప్రభుత్వ ఆఫీసులు, తదితరాలను ఎంపిక చేసుకుని పోలీసులే స్వయంగా వెళ్లి వారితో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ముఖ్యకూడళ్లు, ప్రజలకు బాగా కనిపించే ప్రాంతాల్లో భౌతికదూరం, మాస్కు వినియోగం, చేతుల పరిశుభ్రతపై చక్కటి హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. మాస్కులు, సామాజిక దూరం ఉల్లంఘనలపై ఎపిడమిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడంలేదు. అందుకే, ఈ వినూత్న ఆలోచన అమలుపరుస్తున్నారు.
సెకండ్ వేవ్ చాలా డేంజర్..
దేశంలో కరోనా మొదటి దశ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్ని దారుణంగా దెబ్బతీసింది. త్వరలో సెకండ్ వేవ్ మొదలవనుంది. వరుసగా కురుస్తోన్న వర్షాలు, శీతాకాలం రానుండడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముంది. ఇటీవల కేరళలో ఓనమ్ పండుగ వల్ల లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం సెకండ్ వేవ్ తీవ్రత, దాని నివారణపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ప్రజలు ఎంతమేరకు భౌతిక దూరం పాటిస్తారన్నది అనుమానమే. అందుకే, రానున్న ఉపద్రవంపై ప్రజలను చైతన్యం చేయడానికి తెలంగాణ డీజీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ జిల్లాలో ఎంతమందితో ప్రతిజ్ఞ చేయించారు? ఎందరికి అవగాహన కల్పించారు? తదితర విషయాలను ఏరోజుకారోజు డీజీపీ కార్యాలయానికి చేరేలా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి, రంజాన్ లాంటి పర్వదినాల సమయంలో ఆంక్షలతో వ్యవహరించడం మంచి ఫలితాలనిచ్చింది. అందుకే, రాబోయే పండుగల్లోనూ కేసులు అదుపులో ఉండేలా ఈ విధానం ఎంచుకున్నారు.
భారీ వర్షాలు.. పోలీసుల సెలవులు రద్దు..
రాష్ట్రంలో వరుసగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ డిపార్ట్‌మెంటులో సెలవులు రద్దు చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. పోలీసులంతా 24 గంటలు డ్యూటీలోనే ఉండాలని డీజీపీ ఆదేశించారు. గ్రామాల్లో విపత్తు నిర్వహణ దళం(డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్) అందుబాటులో లేని కారణంగా.. వాగులు, వంకలు, రిజర్వాయర్లు, వంతెనలు, కాలువలు, చెరువు గట్ల పరిస్థితిపై నీటిపారుదల, పంచాయతీశాఖ ఉద్యోగులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో ప్రతీ ఠాణా పరిధిలో గ్రామస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం సమాచారమార్పిడి చేస్తున్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. వరద, రోడ్డు, కరెంటు, ఇళ్లు, పాతగోడలు కూలడం, తదితర ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. వెంటనే పోలీసులు స్పందించేలా ఎస్‌హెచ్‌వోలు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment