ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కొనుగోలు చేసిన మద్యం తీసుకెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నాయి. వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో అప్పగించి వారిపై పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. అయితే స్వాదీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీస్ స్టేషన్ల గదులు నిండిపోయాయి. ఈ మద్యాన్ని ఎంత తొందరగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌గా అప్పగిద్దామా అని ఆయా ఠాణాల పోలీసులు ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్ పోలీస్‌స్టేషన్, నారాయణగూడ, అబిడ్స్, దోమలగూడ తదితర 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2727 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే అధిక మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్తుండగా 11 కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో 1509 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకొని వీరిపై కేసులు కూడా నమోదు చేశారు.
అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే నగదు, మద్యం సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబండింది.
నమూనాల సేకరణ...
ఎన్నికల సమయంలో స్వాదీనం చేసుకున్న మద్యంలో ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి ఒక సీసాను పోలీసులు సీజ్ చేసి సీల్ వేసి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ల్యా»ొరేటరీకి పంపించారు. ఉదాహరణకు 12 బీరుసీసాలు స్వాధీనం చేసుకుంటే అందులో ఒక బీరుసీసాను సీజ్ చేసి ఎక్సైజ్ ల్యా»ొరేటరీకి పంపించడం జరుగుతుంది. మిగతా మద్యం అంతా ఠాణాల్లోని గదుల్లో భద్రపరిచారు.
సీజ్ చేసిన పంపించిన మద్యం నాటు సరుకా..? ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరా..? అనే విషయాన్ని కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే పోలీసులు ఆ మొత్తాన్ని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు. డీసీ ఇచ్చిన రశీదును జత చేసి చార్జిషీట్ దాఖలు చేస్తారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా పెండింగ్‌లోనే ఉంది. ఇంత వరకు కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందలేదు. కనీసం పంపించిన నమూనాలు కూడా కెమికల్ ల్యాబ్‌లో ఇంకా పరిశీలించలేదని తెలుస్తున్నది.
ఈ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు స్వాదీనం చేసుకున్న మద్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వా«దీనం చేసుకున్న మద్యం సీసాల్లో ఒక్కటి మిస్ అయినా సంబంధిత దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఠాణాల్లో పేరుకుపోయిన మద్యం సీసాలను కాపాడుకోవడానికి దర్యాప్తు అధికారులు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. కష్టపడి స్వాదీనం చేసుకున్న మద్యాన్ని డిప్యూటీ కమిషనర్‌కు అప్పగించేదాకా జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇంతా కాదు. పోలీసులకు ఈ మద్యం చుక్కలుచూపిస్తున్నది.
గత ఎన్నికలతో పోలిస్తే భారీగా నగదు స్వాదీనం...
► 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడింది. నిబందనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి రూ. 50 వేలకంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తుండగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో పాటు ఎఫ్‌ఎస్‌టీ బృందాలు నగదును పెద్ద మొత్తంలో స్వా«దీనం చేసుకున్నాయి.
► జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎఫ్‌ఎస్‌టీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17.80 లక్షలు పట్టుబడగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 61.46 లక్షలు పట్టుబడ్డాయి. ఈ మొత్తాన్ని జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు పోలీసులు అప్పగించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను బాధితులు చూపిస్తే పోలీసులు ఆ డబ్బును తిరిగి వారికి అప్పగిస్తారు.
► ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో రూ. 5 కోట్ల 51 లక్షల నగదు ఎన్నికల సమయంలో పట్టుబడింది. అలాగే రూ. 3.97 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాదీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 18 బస్తాల రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment