
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మరోసారి పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ ప్రభుత్వంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటి.. చేసేదొకటి అన్నారు. కేసీఆర్ విషయంలో ప్రజలు రెండుసార్లు మోసపోయారు.. మూడోసారి ఎవరు మోసపోతారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, పాలేరులో పొంగులేటి ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. ఐదు లక్షల కోట్లు అప్పులయ్యాయి. ఈ ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు. యువతకు ఆత్మహత్యలే దిక్కయ్యాయి. ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటి.. చేసేది మరొకటి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో దళిత బంధు పథకంలోనే తెలిసింది. ఒక్క గ్రామంలో కూడా 20 డబుల బెడ్‌రూమ్ ఇండ్లు కట్టలేదు. సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు.
రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రకటిస్తాను. అధికారం శాశ్వతం కాదు. రాబోయే ప్రభంజనంలో మీరంతా కొట్టుకుపోతారు. జెండా ఏదైనా సరే.. ఎజెండా మాత్రం ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే. ఎన్నికల సమయం రాబోతుంది.. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతీ ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment