
చుంచుపల్లి: తరతరాలుగా పోడు సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులపై కేసులు పెట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన పోడురైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తొస్తారని, తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పోడు రైతులకు దగ్గరుండి పట్టాలిప్పిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం.. నేటికీ దానిని నెరవేర్చలేదన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా సెంటు పోడు భూమికి కూడా పట్టా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన పోడు ఘర్షణల్లో అనేకమంది గిరిజనులపై అక్రమ కేసులు నమోదు చేశారని, పోడు పోరులో కొందరు చనిపోయారని గుర్తు చేశారు.
వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గిరిజనులపై ఉన్న కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 13 లక్షల ఎకరాల పోడు భూముల కోసం 4.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దాంట్లో 3 లక్షల కుటుంబాలకు 11 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తానని గతేడాది డిసెంబర్‌లో సీఎం ప్రకటించారని, కానీ ఇప్పుడు 1.50 లక్షల మందే అర్హులని, సుమారు 4 లక్షల ఎకరాలే ఇస్తామని చెబుతుండటం హాస్యాస్పదమన్నారు.
ఇది కూడా చదవండి: ఇవి ఎమర్జెన్సీ రోజులు!
Comments
Please login to add a commentAdd a comment